ఆరోగ్యలక్ష్మికి దేశవ్యాప్త ప్రశంసలు

గర్భిణులు, బాలింతల ఆరోగ్యమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్య లక్ష్మి పథకం దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 149 ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని 37,500 అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలుచేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా 5లక్షల 90వేల  మంది గర్భిణులు, బాలింత మహిళలకు, 18లక్షల 20 వేల  మంది చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. వీరికి ప్రతిరోజు ఒక గుడ్డు, 25 రోజులపాటు సంపూర్ణ భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ఉన్నతాధికారుల బృందాలు రాష్ట్రంలో పర్యటించి, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించాయి.

ఇక ఈ విధానాన్ని తమ రాష్ర్టాల్లో అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. తమ రాష్ట్రంలో పథకం అమలుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని కోరుతూ కర్ణాటక మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఉమా మాధవన్.. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయికి లేఖ రాశారు. యూపీకి చెందిన పోషకాహార సంస్థ డైరెక్టర్ జనరల్ కమ్రాన్ రజ్వీ, మహారాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరారు. ఆరోగ్యలక్ష్మి విధానంపై ఆయా రాష్ర్టాలతో ఒప్పందం కుదుర్చుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

మహిళా, శిశు సంక్షేమపథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. ఇటీవల ఢిల్లీలో తీవ్రవాద ప్రభావిత ఏజెన్సీ జిల్లాల్లో మహిళా,శిశు సంక్షేమ శాఖ పనితీరుపై జాతీయ సదస్సు జరిగింది. తెలంగాణ నుంచి హాజరైన మాతా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ విజయేంద్రబోయి ఆరోగ్యలక్ష్మి పథకాన్ని వివరించారు. మిగతా రాష్ర్టాల కంటే తెలంగాణ  చర్యలు మెరుగ్గా ఉన్నాయని సమావేశం కితాబిచ్చింది.