ఆఫర్లతో దూసుకెళ్తున్న శ్రేయ!

2002 లో సంతోషం సినిమాతో తొలి స‌క్సెస్ అందుకుంది శ్రేయ‌. దాదాపు 18 సంవ‌త్స‌రాల సినీ కెరియ‌ర్ లో స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు వ‌యస్సు 35 ఏళ్ళు కాగా, ఇక ఆఫ‌ర్లు రావ‌డమే క‌ష్ట‌మ‌ని అంద‌రు అనుకున్నారు. కాని అంద‌రి అంచ‌నాలు మించేలా హీరోయిన్ పాత్ర‌ల‌తో పాటు కీల‌క మైన రోల్స్ చేస్తుంది. ఇటీవ‌ల బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో.. రాణి వశిష్టీ దేవిగా మెప్పించిన‌ శ్రియా శరణ్, ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతోన్న పైసా వసూల్ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక కృష్ణవంశీ తెర‌కెక్కిస్తున్న‌ నక్షత్రం మూవీలోను శ్రేయ ఐటెం సాంగ్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇక అర‌వింద్ స్వామి, సందీప్ కిష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న న‌ర‌కాసురుడు అనే చిత్రంలో శ్రేయ అర‌వింద్ తో జోడి క‌ట్ట‌నుంది. న‌ర‌కాసురుడు చిత్రం త‌మిళంలో న‌ర‌గ‌సూర‌న్ అనే టైటిల్ తో రూపొందుతుండ‌గా యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే శ్రేయ తాజాగా జరిగిన సైమా వేడుక‌లో తన అందంతో అందరి మతులు పోగొట్టేసింది. స్లీవ్ లెస్ డ్రెస్.. ట్రాన్స్ పరెంట్ వేర్ ధ‌రించి వీక్ష‌కుల‌కి వినోదాల విందు అందించింది. నేటి త‌రం భామ‌ల‌కు గ‌ట్టి పోటి ఇస్తున్న శ్రేయ రానున్న రోజుల‌లో మ‌రిన్ని ఆఫ‌ర్లు అందుకుంటుంద‌ని ఫిల్మ్ నగర్ టాక్!