ఆనంద్ మహీంద్రా బహిరంగ క్షమాపణ

టెక్‌మహీంద్రాలో ఓ ఉద్యోగిని బలవంతంగా తొలిగించిన సంఘటనకు సంబంధించి సంస్థ యాజమాన్యంతో పాటు మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా బహిరంగ క్షమాపణలు కోరారు. దేశంలో ఐదో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టెక్ మహీంద్రాలో మానవ వనరుల(హెచ్‌ఆర్) విభాగ ఎగ్జిక్యూటివ్ ఓ ఉద్యోగికి ఫోన్ చేసి మరుసటి రోజు ఉదయమే రాజీనామా సమర్పించాలని, లేదంటే కంపెనీనే తొలిగించడం జరుగుతుందని బెదిరించారు. ఇరువురి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐటీ రంగంలో ఉద్యోగుల బలవంతపు తొలిగింపులపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వెలుగుచూసిన ఈ సంఘటన కంపెనీని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని భావించిన టెక్ మహీంద్రా యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది.  ఈ విషయంపై క్షమాపణలు కోరుతున్నా. వ్యక్తుల గౌరవ సంరక్షణ మా గ్రూపు ప్రధాన విలువల్లో ఒకటి. భవిష్యత్‌లో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, ఉద్యోగి మధ్య జరిగిన సంభాషణ తీరుపై చింతిస్తున్నాం. భవిష్యత్‌లో మళ్లీ జరుగకుండా అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాం అని టెక్‌మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ నోట్ విడుదల చేశారు. ఆయన నోట్‌ను సంస్థ ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై గుర్నానీ సైతం క్షమాపణలు కోరారు. మరోసారి ఈ తరహా సంఘటనలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.