ఆధునిక, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం

రాష్ట్ర అవసరాలు తీరడంతో పాటు, రైతులకు లాభసాటిగా ఉండేలా వ్యవసాయం చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ఆధునిక, శాస్త్రీయ పద్ధతులను అవలంభించాలని అన్నారు. రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్దిపై హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ఆయన ఉన్నతస్థాయి విస్తృత సమీక్ష నిర్వహించారు.

‘‘రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలి. మే 15లోగానే గ్రామ స్థాయి వరకు విత్తనాలు, ఎరువులు చేరాలి. కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలి. రైతులను మోసం చేసే కల్తీ విత్తనాల రాకెట్లో కొంత మంది వ్యవసాయాధికారులు కూడా భాగస్వాములు కావడం బాధాకరం. ఆ రాకెట్ అంతుచూడాలి. వారి గుట్టు రట్టు చేయాలి. ఇతర రాష్ట్రాలు కేంద్రంగా అక్రమం నడుపుతున్నారు. వారి వివరాలు కూడా తీసుకుని ఈ దందాకు అడ్డుకట్ట వేయాలి. విజిలెన్స్ దాడులు కొనసాగాలి. కల్తీ విత్తనం తయారీ, పంపిణీ, అమ్మకాలను దారుణమైన నేరాలుగా పరిగణించాలి. బాధ్యులపై పిడి యాక్టు కింద కేసులు నమోదు చేయాలి. కఠినంగా శిక్షలు పడేలా చూడాలి. నిరంతర నిఘా కొనసాగాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

‘‘అధిక దిగుబడులు సాధించడానికి అవలంభించాల్సిన వ్యూహాలకు రూపకల్పన చేయాలి. ఉత్పాదకత పెంచడానికి తీసుకోవాల్సిన శాస్త్రీయ పద్దతులను రైతులకు వివరించాలి. గ్రామ స్థాయిలో వ్యవసాయంపై నిరంతర పర్యవేక్షణ అవసరం. అందుకోసమే ప్రభుత్వం 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసింది. ప్రతీ క్లస్టర్ కు ఒక ఎఇవోను నియమించింది. మండల వ్యవసాయాధికారికి శిక్షణ ఇచ్చి ఆగ్రానమిస్టుగా తయారు చేస్తున్నాం. వారంతా రైతులకు అందుబాటులో ఉండి సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలి. ప్రతీ క్లస్టర్లో ఒక హాలు, చిన్న గోదాము ఉండే విధంగా రైతు వేదికలు నిర్మిస్తాం. అక్కడే రైతులు నిరంతరం కలుసుకుని వ్యవసాయానికి సంబంధించిన చర్చలు జరపాలి” అని సీఎం కేసీఆర్ వివరించారు.

“గ్రామాల్లో కూలీలు దొరికే పరిస్థితి లేదు. యాంత్రీకరణమే అంతిమ పరిష్కారం. వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరగాలి. దీనివల్ల పనులు వేగంగా జరగడంతోపాటు, పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుంది. ప్రభుత్వం కూడా తగిన సాయం అందిస్తుంది. ఈ విషయంలో రైతులకు సరైన అవగాహన కల్పించాలి’’ అని సిఎం కేసీఆర్ చెప్పారు.

‘‘ఆయా నేలల స్వభావాన్ని బట్టి ఎక్కడ ఏ పంటలు వేయాలనే విషయంలో అధికారులు తగిన సూచనలు చేయాలి. ఎవరిష్టం వచ్చినట్లు వారు పంటలు వేసే విధానం పోవాలి. అధికారులు సూచించిన పంటలే వేయాలి. అందరూ ఒకటే పంట వేసి రైతులే రైతుకు శత్రువు కావద్దు. అధికారులు కూడా నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయించి రైతులకు చెప్పాలి. డిమాండ్ కు  తగ్గట్లు పంటల సాగుండాలి. రాష్ట్రం మొత్తాన్ని క్రాప్ కాలనీలుగా విభజించి, అన్ని రకాల పంటలు పండించాలి. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది. గిట్టుబాటు ధర వస్తుంది’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

‘‘తెలంగాణ రాష్ట్ర అవసరాలను గుర్తెరిగి పంటల సాగు చేయాలి. రాష్ట్రంలో మనుషులకు ఎంత మొత్తంలో ఆహార పదార్ధాలు కావాలి. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, నూనె గింజలు ఎన్ని అవసరం పడతాయో లెక్కించాలి. మనుషులతో పాటు పశువులు, చేపలు, కోళ్లు తదితర జీవాలకు ఉపయోగపడే ఆహార పదార్ధాలు ఎంత మొత్తంలో అవసరమో గమనించాలి. ఈ విషయాలపై శాస్త్రీయమైన అంచనాకు రావాలి. దానికి తగినట్లు ఆహార ఉత్పత్తులు రావాలి. తెలంగాణకు కావాల్సిన పండ్లు, పూలు తదితర ఉత్పత్తులపై కూడా అంచనాకు రావాలి. దానికి తగినట్లు రైతులను ఆయా పంటల సాగుకు ప్రోత్సహించాలి. తెలంగాణ నేలల స్వభావానికి అనుగుణంగా పండే పంటలు పండించి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలి. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుంది. రాష్ట్రం వ్యవసాయ ఉత్తత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తుంది’’ అని సిఎం  కేసీఆర్ చెప్పారు.

‘‘సంఘటిత శక్తికున్న బలమెంటో తెలంగాణ ఉద్యమం చూపించింది. అదే స్ఫూర్తితో రైతులు సంఘటితం కావాలి. గ్రామస్థాయిలో రైతులందరి భాగస్వామ్యంతో గ్రామరైతు సంఘాలు ఏర్పాటు చేయాలి. తర్వాత మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమాఖ్యల నిర్మాణం కావాలి. మండల రైతు సమాఖ్య సూచించిన తర్వాతే మార్కెట్ కు సరుకులు తీసుకురావాలి. గిట్టుబాటు ధర వచ్చే విషయంలో రైతులకు, వ్యాపారులకు మండల రైతు సమాఖ్య అనుసంధాన కర్తగా ఉంటుంది. గిట్టుబాటు ధర రాకపోతే వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్ర రైతు సంఘం కొనుగోలు చేస్తుంది. దీనికోసం రాష్ట్ర రైతు సంఘం దగ్గర నిధులుంటాయి. బడ్జెట్లోనే మూల నిధిని కేటాయిస్తాం.” అని ముఖ్యమంత్రి వివరించారు.

“ఈసారి వ్యవసాయ బడ్జెట్ కూడా బాగా పెంచుతాం. వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడతాం. ఎక్కువ మంది ఆధారపడిన వ్యవసాయానికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. కాబట్టి ఎన్ని నిధులైనా వెచ్చించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాం. రైతు సంఘాలకు పర్మిట్లు ఇచ్చి ఉత్పత్తులను కొనిపిస్తాం. ప్రాసెసింగ్ చేపించి, మార్కెట్లో విక్రయించే విధానాలు కూడా తెస్తాం. రైతులకు కనీస మద్దతు ధర రావడమే లక్ష్యం. రైతులకు సంఘటిత పరిచి, వారికి చేదోడు వాదోడుగా ఉండే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. రైతులకు ఆధునిక, శాస్త్రీయ పద్దతులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. హైదరాబాద్ లో దాదాపు వెయ్యి మంది స్టేట్ రిసోర్స్ పర్సన్స్ కు నేనే స్వయంగా శిక్షణ ఇస్తా. రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకుంటాం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

‘‘గ్రామాల్లో ప్రస్తుతం వ్యవసాయాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వాటిని క్రోడీకరిస్తాం. ఇకపై భూమి రికార్డులు సక్రమంగా నిర్వహిస్తాం. ఎవరు భూమి కొన్నా, అమ్మినా ఆ వివరాలను రిజిస్ట్రార్ విధిగా గ్రామ రైతు సంఘాలకు తెలియచేయాలి. గ్రామ పరిధిలో ప్రతీ ఇంచు భూమి ఎవరిదనే విషయంలో స్పష్టత వస్తుంది. రిజిస్ట్రేషన్లు, భూమి అమ్మకం, కొనుగోలు విషయంలో కూడా పూర్తి పారదర్శకత ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

‘‘రైతులకు అవగాహన కల్పించేందుకు అవసరమైన రిసోర్స్ పర్సన్స్ ను ఎంపిక చేయాలి. భూములు, రైతుల వివరాలను వీలైనంత త్వరలో క్రోడీకరించాలి. తెలంగాణకు ఏ పంట ఎంత అవసరమో శాస్త్రీయంగా నిర్ధారించాలి. క్రాప్ కాలనీల విభజన త్వరగా పూర్తి చేసి రైతులకు సమాచారం అందించాలి. రైతు సంఘాల ఏర్పాటుకు అవసరమైన భూమిక ఏర్పాటు చేయాలి. రైతులకు అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యవసాయ శాఖను భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా పునర్వ్యవస్థీకరించుకోవాలి’’ అని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, పార్థసారథి, శాంత కుమారి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిభాయి, వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.