ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

అపార సహజ వనరులున్న అదిలాబాద్ జిల్లాలో కొత్తగా సిమెంట్ ఫాక్టరీని స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. అదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడ, రామాయి గ్రామ పంచాయతీల పరిధిలో ప్రైవేట్ రంగంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదిలాబాద్ మండలం పరిసర ప్రాంతాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో సున్నపు గనులున్నాయి. వందేళ్ల పాటు సిమెంట్ ఉత్పత్తి చేసేందుకు సరిపడా సున్నపు గనుల నిల్వలున్నాయి.

36 నెలల్లో సిమెంట్ ఫ్యాక్టరీని స్థాపించాలని నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు 1572.99 ఎకరాల నోటిఫైడ్ ఏరియా ఉండగా ఇందులో 747.16 ఎకరాలను కేటాయిస్తూ బిర్లా సిమెంట్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఫ్యాక్టరీ ఏర్పాటుతో జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రత్యక్షంగా, రెండు వేల మందికి ఉపాధి దొరికే అవకాశాలున్నాయి. వెయ్యి కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ఓ భారీ పరిశ్రమ ఏర్పడడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఐటీఐ కళాశాలతో పాటు ఆస్పత్రి కూడా ఏర్పాటు కానుంది.

ఫ్యాక్టరీ స్థాపేంచేందుకు కేటాయించిన 747.16 ఎకరాల భూమిని 50 ఏళ్ల వరకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కొత్తగా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్‌గూడ, రామాయి, గ్రామస్తులతో పాటు ఫ్యాక్టరీ ఏర్పాటుతో అదిలాబాద్ టౌన్‌కూ లాభం చేకూరనుంది. వివిధ పన్నుల రూపంలో ఏటా 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా సమకూరనుంది. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఎంతో దోహద పడుతుందంటున్నారు మంత్రి జోగు రామన్న. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.