అవినీతిని సహించే ప్రసక్తే లేదు

దేశ ఆర్థిక వ్యవస్థలో చార్డర్డ్ ఎకౌంటెంట్లది ముఖ్యపాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోడి అన్నారు. వైద్యులు శారీరక జబ్బులను నయం చేస్తే.. సీఏలు ఆర్థిక పరమైన జబ్బులను నయం చేస్తారని ప్రశంసించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సీఏల భారీ సభకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఏలకు దేశం పవిత్రమైన అధికారం ఇచ్చిందని, తప్పులను సరిదిద్ది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో వారి పాత్ర కీలకమైనదని ప్రధాని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేయడంలో సీఏలు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు.

అవినీతిని సహించే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన అన్ని లావాదేవీలపై నిఘా ఉంచామని, అవినీతి ఏ రూపంలో  ఉన్నప్పటికీ ముమ్మాటికీ వదిలే ప్రసక్తి లేదన్నారు. ఇన్నాళ్లు పేదలను దోచుకున్న వాళ్లు దాన్ని తిరిగివ్వాల్సిందేనన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అవకతవకలకు పాల్పడ్డ మూడు లక్షలకు పైగా కంపెనీలపై నిఘా పెట్టామన్నారు ప్రధాని మోడీ. లక్షకు పైగా కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశామన్నారు. జీఎస్టీ అమలుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ అమలుతో నల్లధనం అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.