అర్జున రణతుంగ సంచలన ప్రకటన!

భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సంచలన ప్రకటన చేశాడు. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన 53 ఏండ్ల రణతుంగ దీనికి సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశాడు. “ఫైనల్లో మా జట్టు 6వికెట్ల తేడాతో ఓడడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. అప్పుడే మ్యాచ్ ఫిక్స్ అయినట్లు అనుమానమొచ్చింది. గెలిచే పరిస్థితుల్లో నుంచి ఓటమివైపు నిలువడం ఆశ్చర్యం కల్గించింది. దీనిపై ఇప్పుడు సమగ్ర దర్యాప్తు జరుగాలి. ప్రస్తుతం అన్ని విషయాలు బహిర్గత పరుచలేను. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెల్లడిస్తా” అని రణతుంగ అన్నాడు. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన నాటి ఫైనల్లో లంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరేండ్ల క్రితం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్‌పై పూర్తి వివరాలు బయటికి రావాలంటే కచ్చితంగా విచారణ జరుపాలంటూ ప్రభుత్వాన్ని రణతుంగ డిమాండ్ చేశాడు. దీంతో పాటు ఆదేశంలో ప్రస్తుత క్రికెట్ పరిస్థితిపై అధ్యక్షుడు, ప్రధానికి రణతుంగ లేఖ రాశాడు.