అమర్నాథ్ బాధితులకు సర్కారు అండ

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రవాసులు ప్రమాదానికి గురవడంపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం బారిన పడ్డ వారిని రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ వద్ద బస్సులో సిలిండర్ పేలడంతో శంకర్‌శర్మ అనే వ్యక్తి మృతి చెందగా… ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్పందించిన సర్కార్‌.. జమ్ముకశ్మీర్ అధికారులతో సంప్రదింపులు జరిపింది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో సీఎస్‌ ఎస్పీ.సింగ్.. జమ్ముకశ్మీర్ సీఎస్‌కు, డీజీపీకి లేఖ రాశారు.

బాధితులంతా ఖాజీకుండ్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో ఉన్నారని అక్కడి అధికారులు ప్రభుత్వానికి సమాచారం అందించారు.  గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, యాత్రికులను భద్రంగా ఢిల్లీకి పంపించాలని కోరారు సీఎస్‌ ఎస్పీ సింగ్‌. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు బాధితులతో మాట్లాడుతూ వారిని ఢిల్లీకి తరలించే ఏర్పాటు చేస్తున్నారు. అనంతనాగ్‌లో సంఘటన జరిగిన వెంటనే కామారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్.. మంత్రి కేటీఆర్‌కు ఫోన్ ద్వారా విషయం చేరవేశారు. మంత్రి కేటీఆర్ సీఎస్‌ను అప్రమత్తం చేశారు. కాగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కరీంనగర్ జిల్లా గణేశ్‌నగర్‌కు చెందిన శంకర్‌శర్మ చికిత్స పొందుతూ మృతి చెందారు. తొలుత వేరే వ్యక్తిగా భావించారు. గాయపడ్డ జయంతి, విశ్వనాథం, విజయ, వసారయ్య, విజయలక్ష్మి, లక్ష్మీబాయి, యాదగిరిగౌడ్, అనురాధ శ్రీనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరెవరికీ ప్రాణహాని లేదని, అందరూ కోలుకుంటున్నారని అక్కడి వైద్యులు అధికారులకు తెలిపారు.

పేలుడు ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకుండా ఉన్న 38 మందిని ఖాజీకుండ్‌లోని 163వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో ఉన్న పునరావాస కేంద్రానికి తరలించి భోజనం, బస ఏర్పాట్లు చేశారు. అనంతనాగ్ జిల్లా కలెక్టర్ శుక్రవారం సాయంత్రం బెటాలియన్‌కు వచ్చి యాత్రికులతో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాత్రి సేద తీరగానే తెలంగాణకు పంపిస్తామని హామీ ఇచ్చారు. శంకర్‌శర్మ మృతదేహాన్ని ఇవాళ విమానంలో నేరుగా హైదరాబాద్‌కు తరలించనున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతంగిరి శ్రీనగర్ కలెక్టర్‌తో మాట్లాడి విమానంలో తరలించేలా ఏర్పాట్లు చేశారు. గాయపడ్డ వారిని, మిగతా యాత్రికులను ఢిల్లీకి తరలించి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకురానున్నారు.