అభివృద్ధిలో పాలమూరును ముందుంచుతాం

పాలమూరు పచ్చబడే దాకా టిఆర్ఎస్ ప్రభుత్వం విశ్రమించదని మంత్రి కేటీఆర్ అన్నారు. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు కట్టి తీరుతామని స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోతలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. పాల‌మూరు జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

మంత్రి కేటీఆర్ ఉదయం నుంచి విరామం లేకుండా పాలమూరు జిల్లాలో పర్యటించారు. ముందుగా పాల‌మూరులోని మ‌యూరి పార్క్‌ని మంత్రి కేటీఆర్ సంద‌ర్శించారు. పార్కులో సంద‌ర్శ‌కుల‌తో మాట్లాడి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్కులో కొత్తగా ఏర్పాటు చేసిన అడ్వెంచర్ క్యాంపును కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్‌తోపాటు మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ రోప్ వేపై ప్రయాణించారు.

అనంతరం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. న‌గ‌రంలో సీసీ రోడ్ల నిర్మాణం, మిష‌న్ భగీరథ, డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల పథకాలను ప్రారంభించారు. తర్వాత డ్వాక్రా మ‌హిళ‌లతో జెడ్పీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొన్నారు. గ‌త ప్ర‌భుత్వాలు పాల‌మూరు జిల్లాకు చేసిన అన్యాయం వల్లే జిల్లాలో వ‌ల‌స‌లు పెరిగా‌యని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం వచ్చిన తర్వాత ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాపై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ని తెలిపారు. పాలమూరు జిల్లాను అభివృద్ధిలో ముందుంచుతామన్నారు కేటీఆర్.

అనంతరం నారాయ‌ణ్ పేట్ నియోజ‌కవ‌ర్గంలో కేటీఆర్ పర్యటించారు. మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కోయిల్ సాగ‌ర్ మండ‌లం రామ‌కొండ గ్రామంలో మిష‌న్ భ‌గీరథ ప‌థ‌కంలో భాగంగా రూ.18 కోట్ల‌తో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌ని కేటీఆర్ ప్రారంభించారు. నారాయ‌ణ్ పేట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మ‌రోవైపు రూ.29 కోట్ల‌తో రహదారుల విస్తరణ ప‌నుల‌ను ప్రారంభించారు.

అనంత‌రం నారాయ‌ణ్ పేట్ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన పాలమూరు పచ్చబడేదాకా ప్రభుత్వం విశ్రమించదని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. పాలమూరు జిల్లాలోనే పుట్టిన కొందరు వ్యక్తులు… ప్రాజెక్టులకు అడ్డుపడటం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. కోర్టుల్లో కేసులు వేసి అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి తీరుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

నారాయ‌ణ్ పేట్‌లో ఏరియా ఆస్ప‌త్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. నారాయ‌ణ్ పేట్ లో సైనిక్ స్కూల్ తేవ‌డానికి కృషి చేస్తానని ఎంపీ జితేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ అందించిన తోడ్పాటుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చెప్పారు.

అటు మంత్రి కేటీఆర్ సమక్షంలో నారాయణపేట్‌ మున్సిపల్ చైర్మన్‌తోపాటు పలువురు నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తామని వారంతా ప్రతినబూనారు.