అనుభవం ఉన్న రాష్ట్రంలా అభివృద్ధిలో పరుగులు

కొత్త రాష్ట్రం అనేక కష్టాల మధ్య మొదలైనా అపార అనుభవం ఉన్న రాష్ట్రాల కంటే గొప్పగా ముందుకువెళ్లడం పట్ల సంతోషం ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఎక్కడా గ్యాప్ లేకుండా చూసినందుకు అధికారులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖపై హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆయన సమీక్ష జరిపారు.

రాష్ట్రానికి, అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ గుండె లాంటిదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో, బంగారు తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున పనులు సమైక్య రాష్ట్రంలో కూడా జరగలేదన్నారు. తక్కువ సిబ్బంది ఉన్నా టెక్నాలజీ వాడుకొని ఎక్కువ పని చేయగలిగామని అన్నారు. అయితే, అక్కడక్కడా బిల్లులు చెల్లించే విషయంలో వస్తున్న ఆరోపణలు కూడా రాకుండా చూసుకోవాలని ఆర్థిక శాఖ అధికారులను కోరారు. జిల్లాల వారీగా ప్రతి నెల శాఖ పని తీరు, సమస్యలపై సమీక్ష నిర్వహించి, రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.

ఆర్థిక శాఖ అధికారులుగా డబ్బు ఇవ్వడమే కాదు పక్కదోవ పట్టకుండా చూసుకోవాలని మంత్రి ఈటెల సూచించారు. ఖర్చు పెట్టబడిందో లేదో చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆర్థిక శాఖలో అనేక రుగ్మతలు ఉండేవని, సొంత మనుషులకు దోచిపెట్టేవారని, వాటిని అరికట్టగలిగామని చెప్పారు.

36 లక్షల మందికి సామాజిక పెన్షన్లు ఇస్తూ దేశంలోనే ముందున్నామని మంత్రి ఈటెల అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిచడంలో, ఉద్యోగులకు జీతాలు పెంచడంలో మిగతా రాష్ట్రాల కంటే ముందున్నామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఎయిడెడ్ ఉద్యోగులకు జీతాలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నదని చెప్పారు. చిన్న జీతాలు ఉన్నవారికే ఎక్కువ కష్టాలు ఉంటాయని, వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.

వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్టుమెంట్ ద్వారా క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ ఎక్కువ చేయగలిగినమని మంత్రి ఈటెల చెప్పారు. మూడు సంవత్సరాల్లోనే 10 సంవత్సరాలు ఖర్చు చేసేంత ఖర్చు పెట్టామన్నారు. రోడ్లు, మౌళిక వసతులు, నీటి పారుదల రంగం, తాగునీటి రంగంలో ఎక్కువ ఖర్చుపెడుతున్నామని వివరించారు.

జిల్లాల్లో ట్రెజరీ డిపార్టుమెంట్ కీలకపాత్ర పోషిస్తోందని, అన్ని జిల్లాలో కార్యాలయాలు సొంత భవనాల్లో ఉండేలా చూస్కోవాలని సూచించారు. అన్ని కార్యాలయాల్లో కంప్యూటర్స్, సిబ్బంది ఉండేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీని కోరారు. రెండు, మూడు జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని,  వాటిమీద సమగ్ర నివేదిక అందించాలని రామకృష్ణారావుని కోరారు. కాంట్రాక్టర్స్ కి ఒప్పందం కంటే ఎక్కువ, చేసిన పని కంటే ఎక్కువ బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.

దేశంలో తెలంగాణకు చాలా గుర్తింపు వచ్చిందని మంత్రి ఈటెల చెప్పారు. మొదట్లో తాము ఢిల్లీ వెళితే ఎవరు పట్టించుకోలేదని, మన పనితీరు, మన పథకాలు, మన వృద్ధి రేటు చూసి మనకు చాలా గౌరవం ఇస్తున్నారని అన్నారు. 17 రంగాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని మంత్రి రాజేందర్ చెప్పారు. స్టేట్ ఓన్డ్ టాక్స్ రెవిన్యూ (SOTR ) లో 17.9  శాతం అభివృద్ధితో దేశంలో నెంబర్ వన్ గా ఉన్నామని తెలిపారు. ఎస్వోటీఆర్ లో మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా రాష్ట్రాలను వెనక్కు నెట్టేశామని వెల్లడించారు.

తెలంగాణ పేదది కాదు.. పేదరికంలో ఉంచబడిందని ఉద్యమ సమయంలోనే సీఎం కేసీఆర్ అనేక సభల్లో చెప్పారని మంత్రి రాజేందర్ గుర్తుచేశారు. తెలంగాణలో ఖర్చు పెట్టడానికి సమైక్య పాలకులకు మనసు రాలేదన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి పైసాను ఇక్కడే ఖర్చు పెడుతున్నామని, తెలంగాణ మోస్ట్ హాపెనింగ్ స్టేట్ అని దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కితాబునిచ్చారని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అధికారుల సహకారం అవసరం అన్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను వెతకవద్దని, ఫలితాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ రామకృష్ణారావు, ఫైనాన్స్ సెక్రటరీ శివశంకర్, ఆడిట్, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, వర్క్స్ అకౌంట్స్, ఇన్సూరెన్స్, పే అండ్ అకౌంట్స్ శాఖలకు చెందిన 31 జిల్లాల అధికారులు పాల్గొన్నారు.