అంబేద్కర్ స్ఫూర్తితో గురుకులాలు

అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగానే రాష్ట్రంలో గురుకుల పాఠశాలల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని చెప్పారు. నకిరేకల్, నార్కట్‌పల్లిలో ఆయన పర్యటించారు. నకిరేకల్ పట్టణంలో నియోజకవర్గస్థాయి ప్రభుత్వ ఆంగ్ల విద్య ఉద్దీపనను ప్రారంభించి మాట్లాడారు. గత పాలకుల హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ ఏర్పాటైన మూడేండ్లలోనే 525 గురుకుల పాఠశాలలను ప్రారంభించుకుని వేల కోట్ల రూపాయలను విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. నిరుపేదలకు ఆంగ్ల విద్యనందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, 8,600 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా నకిరేకల్ నియోజకవర్గంలో ఎల్‌కేజీ, యూకేజీ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, నాగార్జునసాగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య పాల్గొన్నారు.