అంగరంగ వైభవంగా లష్కర్‌ బోనాలు

హైదరాబాద్ నగరంలో బోనాల సందడి మొదలైంది. సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల సందడి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాట్ల మధ్య.. తొలిపొద్దున అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమైంది. డప్పుచప్పుళ్లు,. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.

లష్కర్ బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటలకు మహాంకాళి అమ్మవారికి.. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పట్టు వస్త్రాలు, తొలి బోనాన్ని సమర్పించారు. దీంతో ఆలయ నిర్వహకులు కాళీమాతకు మొట్టమొదటి పూజ నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటున్నారు. పిల్లపాపల్ని  చల్లగా చూడమంటూ అమ్మవారిని వేడుకుంటున్నారు.

ఆషాఢమాసంలో నిర్వహించే బోనాల జాతర వేడుకలు గత నెల 25న అమ్మవారి ఘటం ఎదుర్కోలుతో కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. పదిహేను రోజుల పాటు ఘటాలు లష్కర్ పురవీధుల్లో ఇంటింటికి ఊరేగాయి. ఈరోజు శాస్త్రప్రకారం అమ్మవారికి బోనాల సమర్పణ మొదలైంది. ఇవాళ, రేపు అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. రేపు రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఉజ్జయిని మహంకాళి బోనాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. లష్కర్ బోనాలకు నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రానుండటంతో అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్చించే మహిళల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీలకు ఒకటి, సాధారణ భక్తులకు మూడు క్యూలైన్‌ లు ఏర్పాటు చేశారు. అటు పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరను పర్యవేక్షించేందుకు 132 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, జల మండలి, ఎలక్ట్రిసిటీ తదితర విభాగాల అధికారులు పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇక బోనాలకు వచ్చే భక్తుల కోసం 100 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు.

అటు బోనాల ఉత్సవాల కోసం సాంస్కృతిక శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. దేవాలయం పరిసర ప్రాంతాలలో ఎనిమిది సెంటర్లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఐతే గతేడాది లష్కర్ బోనాలకు 23 లక్షల మంది భక్తులు రాగా..  ఈసారి 30 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.