TSRDC చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నర్సారెడ్డి

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సీఎం కేసీఆర్ సరైన గౌరవం ఇస్తారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పార్టీలోని అందరికి సముచిత స్థానం దక్కుతుందని చెప్పారు. ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ ఈఎన్సీ కార్యాలయంలో రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తూంకుంట నర్సారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డికి మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఎంపీలు కేకే, బీబీ పాటిల్ శుభాకాంక్షలు తెలిపారు.  ఎలాంటి పదవులు ఆశించకుండా నర్సారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ కోసం కష్టపడ్డాడని హరీష్ రావు అన్నారు. దేశంలోనే నెంబర్.1 నియోజకవర్గంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుతమని వెల్లడించారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నరని మంత్రి తుమ్మల అన్నారు. మూడేళ్లలో సీఎం అనేక అభివృద్ధి పనులు చేసి చూపించారన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు తూముకుంట కృతజ్ఞతలు తెలిపారు.