గతేడాది 46.74 లక్షల ఎకరాల్లో పంటల సాగు

రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చేసేందుకు ఉరకలెత్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి రెండేండ్లలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేక సమైక్య పాలనలోని లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది..ప్రభుత్వ కృషికి వరణుడి కరుణ తోడు కావడంతో మూడో ఏట మంచి వర్షాలు పడ్డాయి. అప్పటికే ప్రభుత్వం సాగునీటి రంగాన్ని ఆకళింపు చేసుకొని గాడిన పెట్టడంతో తెలంగాణ భూముల్లో సిరులు పండాయి. గతంలో ఒక్క పంటకే కనాకష్టంగా నీళ్లందే పరిస్థితి నుంచి యాసంగిలోనూ అనేక ప్రాజెక్టుల కింద రికార్డుస్థాయి ఏరువాక సాగింది. ఈ క్రమంలో గత ఏడాది ఏకంగా 46.74 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పడించారు.. అందులో సింహభాగం రైతులు తరి పంటను పండించినట్లు కాడా నివేదిక స్పష్టం చేస్తున్నది. గతేడాది ఫలితాలతో నీటిపారుదల శాఖ ఈ ఏడాది మరిన్ని లక్షల ఎకరాల్లో అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

తెలంగాణ సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు గత ఏడాది నుంచే మొదలయ్యాయని శాస్త్రీయ లెక్కలు చెప్తున్నాయి. నీటిపారుదల శాఖ తీసుకున్న చర్యలతో మధ్యతరహా, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల కింద కూడా గణనీయంగా సాగు విస్తీర్ణం పెరిగింది. ఇందుకు పాత పాలమూరు జిల్లానే సజీవ సాక్ష్యంగా నిలిచింది. తెలంగాణ ఏర్పడే నాటికి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద కేవలం 33 వేల 500 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 12 వేల పాత ఆయకట్టుకు సాగునీరు అందించారు. కానీ తర్వాత వచ్చిన తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఈ నాలుగు ప్రాజెక్టుల కింద అదనంగా 3 లక్షల 94 వేల 500 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చింది. ఆపై గత ఏడాది అదనంగా 4.50 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. ఈసారి ఏకంగా ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు లక్ష్యంగా పనులు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యక్షంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు, సాక్షాత్తు మంత్రే ప్రాజెక్టుల వద్దకు వెళ్లి రాత్రివేళల్లోనూ నిద్రించడంతో అధికారులు, ఏజెన్సీల్లో సీరియస్‌ నెస్ పెరిగింది. ఫలితంగానే వేగంగా పనులు పూర్తవుతున్నాయి.

ఇక సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో పాటు మంత్రి హరీశ్‌రావు చొరవతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎస్సారెస్పీకి వచ్చిన కాల్వల ద్వారా ఖమ్మం వరకు పారించి.. ప్రధానంగా చెరువులు నింపారు. ఎల్లంపల్లి ద్వారా నీటిని సాధ్యమైనంత మేరకు చెరువులకు మళ్లించారు. మహబూబ్‌నగర్‌లోనూ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వేల చెరువులు నింపారు. ఇలా రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల కింద ఏకంగా 2400 చెరువులను నింపినట్లు నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ముందు జాగ్రత్త చర్యతోనే యాసంగిలో భారీస్థాయిన సాగు విస్తీర్ణం పెరిగింది. దీనికి తోడు మంత్రి హరీశ్‌రావు ప్రతి సమీక్షలోనూ టెయిల్ టు హెడ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం కూడా మంచి ఫలితాలనిచ్చింది. చివరకు ఏపీ, కృష్ణా బోర్డు అనేక అవాంతరాలు కలిగించినా నాగార్జున సాగర్‌లో ఉన్న కొద్దిపాటి నీటిని ఎడమ కాల్వకు మళ్లించి యాసంగిలోనే నాలుగు లక్షల ఎకరాలకు పైగా పంటలను కాపాడారు.

ఇక మిషన్ కాకతీయ రెండు దశల ద్వారా చెరువుల్లో ఆరు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది, భూగర్భజలాల మట్టాలు పైకి రావడంతో ఈ రెండు వనరుల కిందనే 15.50 లక్షల ఎకరాల సాగు జరిగింది. దీంతో గతేడాది సంవత్సరం నీటిపారుదల శాఖ కొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టినట్లయింది. ఈ అనుభవాలు, దీని భూమికగా ఈసారి సాగు విస్తీర్ణాన్ని ఇంకా పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది లో భారీ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అదనంగా 9.67 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు చెరువుల కింద మరో మూడు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు ఇవ్వాలనే లక్ష్యాన్ని నీటిపారుదల శాఖ నిర్దేశించుకుంది.