22 వేల ఇంజినీరింగ్ సీట్లకు కోత!

రాష్ట్రంలో 22 వేల ఇంజినీరింగ్ సీట్లకు జేఎన్‌టీయూహెచ్ అధికారులు కోత పెట్టినట్లు తెలుస్తున్నది. 2017-18 విద్యా సంవత్సరంలో జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని 180 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు, వాటిలో 75 వేల సీట్లకు మించకుండా అఫిలియేషన్లు ఇస్తున్నారు. డిమాండ్ ఆధారంగానే ఈసారి ఇంజినీరింగ్ సీట్లకు అఫిలియేషన్లు ఇస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీలలో 2017-18 సంవత్సరంలో మొత్తం 1.04 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కన్వీనర్ కోటాలో 71,066 సీట్లు ఉన్నాయి. మిగిలిన సీట్లు యాజమాన్య కోటాలో ఉన్నాయి. కన్వీనర్ కోటాలో 55,000, యాజమాన్య కోటాలో 18,000 సీట్లు మాత్రమే నిండాయి. గత విద్యా సంవత్సరంలో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి 73,000 సీట్లు మాత్రమే నిండగా 31,000 సీట్లు మిగిలాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు దాదాపు 180 కాలేజీలకు అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తిచేసి, ఆయా కాలేజీల వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తామని జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య తెలిపారు. వెంటనే అఫిలియేషన్ పొందిన ఇంజినీరింగ్ కాలేజీల జాబితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి, ఎంసెట్ అడ్మిషన్ కన్వీనర్‌కు పంపుతామని చెప్పారు. ఈ వివరాలను జేఎన్‌టీయూహెచ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు.