19 పరుగుల తేడాతో పాక్‌ విజయం 

చాంపియ‌న్స్ ట్రోఫీలో సౌతాఫ్రికాకు పాకిస్థాన్‌ షాక్ ఇచ్చింది. ఎడ్జ్‌బ‌స్ట‌న్‌లో జ‌రిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో పాకిస్థాన్ 19 పరుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యం సాధించింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం పాకిస్థాన్ విక్ట‌రీ కొట్టింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 219 ర‌న్స్ చేసింది. అయితే టార్గెట్‌ను చేజ్ చేసే క్ర‌మంలో పాకిస్థాన్ 27 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల‌కు 119 ర‌న్స్ చేసింది. ఆ స‌మ‌యంలో వ‌ర్షం రావ‌డంతో మ్యాచ్‌ను నిలిపేశారు. డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం పాక్ 27 ఓవ‌ర్ల‌లో వంద ర‌న్స్ చేస్తే గెలిచిన‌ట్లే. అయితే మ‌ళ్లీ మ్యాచ్ ప్రారంభం కాక‌పోవ‌డంతో పాక్ 19 ర‌న్స్‌తో  విజ‌యం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. మోర్క‌ల్ 18 ర‌న్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసినా సౌతాఫ్రికాకు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఈ విక్ట‌రీతో పాకిస్థాన్ సెమీఫైన‌ల్ ఆశ‌లు నిలుపుకున్న‌ది. ఒక‌వేళ సౌతాఫ్రికా టోర్న‌మెంట్‌లో నిలువాలంటే భార‌త్‌ను ఓడించాల్సి ఉంటుంది. గ్రూప్ బిలో ఇవాళ భార‌త్‌తో శ్రీలంక త‌ల‌ప‌డ‌నున్న‌ది.