15 భాషల్లో 2.0 విడుదల!

సూపర్‌ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 2.0ను పదిహేను భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు 350 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయాలని భావించారు. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలకు మరింత సమయం అవసరం కావడంతో 2018 జనవరికి చిత్రాన్ని వాయిదా వేశారు. మొదట ఐదు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించిన చిత్రబృందం ప్రస్తుతం 15 భాషల్లో విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రజనీకాంత్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని జపనీస్, చైనీస్, కొరియన్‌తో పాటు వివిధ విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర రిలీజ్‌ను మూడునెలల పాటు వాయిదా వేశారని చెన్నై సినీ వర్గాలంటున్నాయి. బాహుబలి-2 చిత్రానికి లభించిన అపూర్వ ఆదరణను దృష్టిలో పెట్టుకొని 2.0 సినిమాను దేశవ్యాప్తంగా 7 వేల స్క్రీన్లలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేయాలనే లక్ష్యంతో చిత్ర దర్శకనిర్మాతలు పావులు కదుపుతున్నారని తమిళ సినీ వర్గాల టాక్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అమీజాక్సన్ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.