హైదరాబాద్ లో 3 వేల వైఫై స్పాట్లు

హైదరాబాద్ లోని 3 వేల ప్రాంతాల్లో ఉచితంగా వైఫై సేవలు అందించడం సాధారణ విషయం కాదని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. అవసరం ఉంటే వైఫై స్పాట్లు మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 10 ఎంబిపిఎస్ స్పీడుతో 30 నిమిషాల పాటు వైఫై ఉచితంగా అందిస్తామన్నారు. నగరానికి వచ్చే ఎంతోమందికి ఇది ఉపయోగకరమన్నారు. బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్ లో హైదరాబాద్ సిటీ హై-ఫై ప్రాజెక్టును మేయర్ ప్రారంభించారు. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ కు హై-ఫైని మణిహారంలా చేకూర్చిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు మేయర్ రామ్మోహన్. వరల్డ్ హై-ఫై డే రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా వైఫై అందించడం ఇండియాలోనే మొదటిసారి అని చెప్పారు. కొన్ని రాష్ట్రాలలో కొన్ని సిటీలలో కొంత మేర మాత్రమే వైఫై స్పాట్స్ ఉన్నాయని తెలిపారు. ఫస్ట్ వైఫై సిటీగా హైదరాబాద్ కు పేరు తీసుకువచ్చిన అందరికి ధన్యవాదాలు చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా రాపిడ్ గ్రోత్ లో హైదరాబాద్ 5 వ స్థానంలో ఉందని మేయర్ రామ్మోహన్ చెప్పారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో జిహెచ్ఎంసీ ముందుంటుందన్నారు. సెల్యూలర్ కంపెనీలు కూడా హైదరాబాద్ అభివృద్ధిలో పాల్గొనాలని కోరారు.

ఎన్నో రంగాల్లో ముందున్న హైదరాబాద్ కు ఈ హై-ఫై మరో విజయమని జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు. జిహెచ్ఎంసీ చేసే ఇతర కార్యక్రమాల్లో కూడా ఐటీ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు. టూరిస్ట్ సిటీగా హైదరాబాద్ ముందుకు సాగుతోందని, ఇందులో హై-ఫై ఎంతో కీలకం అన్నారు. హై-ఫై వల్ల ప్రపంచంతో హైదరాబాద్ కనెక్ట్ అవుతుందని తెలిపారు.

హై-ఫై కోసం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల నుండి కృషి జరుగుతోందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ వెల్లడించారు. ఎన్నో సంస్థలు ఈ కార్యక్రమానికి సహకరించాయన్నారు. హైదరాబాద్ లో జనసంచారం ఎక్కువగా ఉండే 3 వేల ప్లేస్ లలో ఈ వైఫై స్పాట్ లు ఏర్పాటు చేసామన్నారు. హై-ఫై ప్రాజెక్ట్ కోసం కొన్ని గైడ్ లైన్స్ రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చాని చెప్పారు. దేశంలో ఒక నగరాన్ని మొత్తం కవర్ చేసేలా వేగవంతమైన వైఫై అందించడం మొదటిసారి అని కొనియాడారు. రాష్ట్రంలోని ఇతర నగరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ లను వర్తింప చేస్తామన్నారు.