హిమాలయాల్లో ఏసీటీఎస్ కో ఆర్డినేటర్ గల్లంతు

హిమాలయ పర్వతాలపై తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించడానికి వెళ్లిన బృందం కష్టాల్లో పడింది. రుదుగైరా పర్వతంపై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి కిందికి దిగుతుండగా మంచు తుఫాను విరుచుకుపడింది. అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (ఏసీటీఎస్), టీ న్యూస్ బృందం మంచు తుఫానులో చిక్కుకుంది. ఈ ఘటనలో ఏసీటీఎస్ బృందానికి నాయకత్వం వహిస్తున్న కె.రంగారావు గల్లంతయ్యారు. మిగతా సభ్యులంతా సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన రంగారావు కోసం గాలిస్తున్నారు. మంచు దట్టంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. సముద్ర మట్టానికి 5819 అడుగుల ఎత్తులోని రుదుగైరా పర్వతంపై ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించి అడ్వాన్స్ సమ్మిట్ క్యాంప్ నుంచి బేస్ క్యాంప్ నకు చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని హిమాలయాలపై నిర్వహించి చేనేతకు చేయూతనివ్వాలనే సందేశాన్ని ఇవ్వాలని ఏసీటీఎస్, టీ న్యూస్ బృందం ఈ సాహసయాత్ర చేపట్టింది.