హరితహారం ప్రారంభానికి కేంద్రమంత్రికి ఆహ్వానం

వచ్చే నెలలో నిర్వహించే హరితహారం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి వెల్లడించారు. కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్ భేటి తర్వాత ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌ ఆయనకు ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వెయ్యి కోట్ల క్యాంపా నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్ కోరారని, కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పర్యావరణ అనుకూల, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌ ను కేంద్రమంత్రి అభినందించారని వేణుగోపాలచారి తెలిపారు.

హరితహారంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి సహకరించాలని సీఎం కోరారని వేణుగోపాలచారి తెలిపారు. కొత్త రాష్ట్రంలో నీటి పారుదల రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారని చెప్పారు. దేశంలోనే నీటిపారుదల రంగ అభివృద్ధికి ఏటా రూ. 25 వేల కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని వివరించారని వేణుగోపాలచారి వెల్లడించారు.