హరితహారంలో వీఓఏలకు బాధ్యతలు

విలేజ్ ఆర్గనైజర్స్, సెర్ప్ ఉద్యోగులను క్షేత్రస్థాయిలో మరింత క్రియాశీలం చేయాలని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ వారిని భాగస్వాముల్ని చేయాలని చెప్పారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని సిపార్డ్ లో తన శాఖ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.

నర్సరీలు లేని గ్రామాల్లో వీఓఏల ద్వారా ఏర్పాటు చేయించాలని, ఉపాధి హామీ పథకం, హరిత హారంలో వీఓఏలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి కృష్ణారావు ఆదేశించారు. ఉపాధి పనులకు సంబంధించి ప్రతి నెల లక్ష్యాన్ని నిర్దేశించుకొని పూర్తి చేయాలన్నారు. ఏడాదిలో కనీసం 60 శాతం కూలీలకు 100 రోజుల పని కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎంపీడీఓ, డీఆర్డీఓలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు పోవాలని సూచించారు.

వ్యక్తిగత మరుగు దొడ్లు, పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి జూపల్లి చెప్పారు. గ్రామాల్లో పనులకు సంబంధించి ఎంబీలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక నిర్ణయం తీసుకుంటే వెంటనే అమలయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. గతం కన్నా ఈ సంవత్సరంలో ఉపాధి పనులు, హరిత హారం పెద్ద ఎత్తున జరగాలని అన్నారు. పెన్షన్ పంపిణీలో జాప్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అర్హులందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు.