స్వల్పంగా పెరుగనున్న బంగారం ధరలు   

జీఎస్టీ కౌన్సిల్ సామాన్యులకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలు తీసుకుంది. బంగారంతో పాటూ రెడీమేడ్ దుస్తులపై మధ్యతరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా పన్నులను ఖరారు చేసింది. బంగారంపై 3శాతం ట్యాక్స్ విధించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు ఆర్ధిక మంత్రి జైట్లీ. బంగారు నగలతో పాటూ డైమండ్స్ , వెండిపై కూడా 3 శాతం జీఎస్టీ విధించనున్నారు.  ప్రస్తుతం బంగారంపై మినిమం 2 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. కొన్నిరాష్ట్రాల్లో ట్యాక్స్ లు ఎక్కువగా ఉండటంతో పన్ను రేటు 6శాతం వరకు కూడా ఉంది. దీంతో పన్ను రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ప్రజలకు ఊరట కలుగనుంది.

మరోవైపు రెడీమెడ్ దుస్తులపై కూడా జీఎస్టీ ఖరారు చేశారు. రెడీమేడ్‌ దుస్తులపై 12శాతం, నూలు, మిల్లు వస్త్రాలపై 5 శాతం, చేనేతపై 18శాతం, వెయ్యి లోపు వస్త్రాలపై 5 శాతం ట్యాక్స్ ఖరారు చేశారు. మరోవైపు సిల్కు, జనపనార ఉత్పత్తులు, పూజా సామాగ్రికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇక 500 లోపు ఉన్న పాదరక్షలపై 5 శాతం, 500 దాటిన ఫుట్ వేర్ పై 18 శాతం చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు.

బీడీలపై సెస్ ను తొలగించి.. దాన్ని 28శాతం శ్లాబ్ లో చేర్చారు. బీడీ ఆకులపై 18 శాతం ట్యాక్స్ ఖరారు చేశారు.  ఇక బ్రాండెడ్‌ బిస్కెట్లపై 18 శాతం, సౌర పలకలపై 5 శాతం చొప్పున పన్ను విధించారు. వ్యవసాయ పనిముట్లు, యంత్రాల్లో కొన్నింటిపై 5శాతం, మిగిలిన వాటిపై 12శాతం పన్నును ఖరారు చేశారు.

ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తో పాటూ అధికారులు హాజరయ్యారు. బీడీలపై 28శాతం పన్నును వ్యతిరేకించారు ఈటెల. జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నప్పటికీ…క్షేత్రస్థాయిలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయని ఆయన కౌన్సిల్ లో ప్రస్తావించారు. సాఫ్ట్ వేర్ అప్‌ డేట్ పై కూడా దృష్టిపెట్టాలని సూచించారు ఈటెల. అంతేకాదు సినిమా రంగంపై ప్రస్తుతం 28శాతం ఉన్న పన్నును 12శాతానికి తగ్గించాలని కోరినట్లు చెప్పారు ఈటెల.

ఇప్పటికే 95శాతానికి పైగా వస్తువులు, సేవలపై పన్నులు ఖరారు చేసింది జీఎస్టీ కౌన్సిల్. మిగిలిన వాటిపై పన్నులు ఖరారు చేసేందుకు ఈ నెల 11న మరోసారి సమావేశం కానున్నారు. కొన్ని వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలపై ఈ సమావేశంలో మరోసారి చర్చిస్తామని జైట్లీ చెప్పారు.