స్వగ్రామంలో పాల్వాయి అంత్యక్రియలు

గుండెపోటుతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్  రెడ్డి భౌతికకాయం హైదరాబాద్ చేరుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పాల్వాయి భౌతిక కాయాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు  తీసుకువచ్చారు. అక్కడి నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి తరలించారు.  ఉదయం పదిన్నర వరకు పార్టీ నేతలు, అభిమానుల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. ఆ తరువాత గాంధీభవన్ కు తీసుకువస్తారు. గాంధీభవన్  లో నివాళి అర్పించిన తరువాత  పాల్వాయి భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ తరలిస్తారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

అంతకుముందు పాల్వాయి భౌతికకాయాన్ని  ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌ లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీ తరలించారు. కులూ నుంచి పాల్వాయి గోవర్థన్ రెడ్డి భౌతిక కాయాన్ని ఢిల్లీకి తీసుకు రావడానికి రాష్ట్ర సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీయార్ ఆదేశాల మేరకు.. ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌.. కులూ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. ప్రత్యేక ఎయిర్‌ ఆంబులెన్స్‌ ను కులూకు పంపారు. వాతావరణం సహకరించకున్నా.. పాల్వాయి భౌతిక కాయాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశంతో అధికారులు  ఎయిర్‌ అంబులెన్స్‌ లో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీలో పాల్వాయి పార్థీవదేహానికి రాహుల్‌ గాంధీతోపాటు పలువురు నేతలు  నివాళులు అర్పించారు.

అటు ఎంపీ పాల్వాయి మృతికి పలువురు రాష్ట్ర మంత్రులు సంతాపం తెలిపారు. ఎంపీ పాల్వాయి గోవర్థన్  రెడ్డి హఠాన్మనరణం రాష్ట్రానికి తీరని లోటని హోంమంత్రి నాయిని అన్నారు. సౌమ్యుడైన పాల్వాయి…. హైదరాబాద్  లో పాల్వాయి గోవర్ధన్  రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పాల్వాయి మృతి రాష్ట్రానికి తీరని లోటన్నారు ఎంపీలు కేకే, డీఎస్. స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పటి నుంచి పాల్వాయి తనకు తెలుసని కేకే చెప్పారు. ఎప్పుడూ యాక్టివ్ గా పనిచేసేవారని గుర్తుచేసుకున్నారు. తమతో నిత్యం కలుపుగోలుగా ఉండే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇక లేరంటే నమ్మలేకపోతున్నామని డీఎస్ అన్నారు. పాల్వాయి కుటుంబ సభ్యలకు కేకే, డీఎస్ సంతాపం తెలిపారు.

రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతికి పలువురు నాయకులు సంతాపం తెలిపారు. పాల్వాయి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పాల్వాయి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన నేతలు.. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.