సైద్ధాంతిక ప్రాతిపదికనే విపక్ష అభ్యర్థిగా పోటీ

సామాజిక న్యాయం, అవినీతి అంతం, కులవివక్షను రూపుమాపడమే తమ సిద్ధాంతమన్నారు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌. ఒకే విధమైన సైద్ధాంతికతతో విపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచాయన్నారు. ఈ అంశాల ఆధారంగానే తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. తనను కాంగ్రెస్‌ సహా 17 విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయని.. ఆ పార్టీలకు కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో ఇంకా దళితులపై దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మీరాకుమార్. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు.

గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి తాను ప్రచారం ప్రారంభిస్తానని మీరా ప్రకటించారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా శాసన వ్యవస్థలోని సభ్యులందరికి లేఖలు రాశానని చెప్పారు. ఎన్డీఎ అభ్యర్థికి జేడీయు మద్దతుపై ప్రశ్నించగా.. రాజకీయాల్లో అలాంటివి జరుగుతుంటాయని, ఐతే ఏం చేయాలో సరైన సమయంలో తాను చేస్తానన్నారు.