సెమీస్‌ లక్ష్యంగా భారత్‌, సౌతాఫ్రికా ఢీ

ఓవైపు సెమీస్ బెర్త్.. మరోవైపు సారథుల సారథ్యానికి అతిపెద్ద సవాలు.. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో క్వార్టర్‌ ఫైనల్‌గా భావిస్తున్న మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇవాళ భారత్.. దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో నెగ్గిన జట్టు సెమీస్‌కు చేరే అవకాశాలుండటంతో రెండు టీమ్‌లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

దాయాది పాక్‌పై అద్భుత విజయంతో టోర్నీ ఆరంభించిన కోహ్లీ సేన.. అనూహ్యంగా లంక చేతిలో ఖంగుతినడం జట్టు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసింది. ముఖ్యంగా భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా  కాపాడుకోలేకపోయింది. బౌలర్లందరు దారాళంగా పరుగులిచ్చుకున్నారు. దీంతో ఈ మ్యాచ్ కోసం భారత్ కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ప్రొటీస్ జట్టులో ముగ్గురు టాప్ లెఫ్టాండర్స్ డికాక్, డుమిని, మిల్లర్ ఉండడంతో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారు. స్పిన్ ఆడటంలో సఫారీలు బలహీనం కాబట్టి రెండో స్పిన్నర్‌గా జడేజాను కూడా కొనసాగించే అవకాశాలున్నాయి. పవర్‌ప్లేలో ఇతని ఫీల్డింగ్ జట్టుకు అదనపు బలంగా మారింది. ప్రతి మ్యాచ్‌లో జడ్డూ దాదాపు 15 నుంచి 20 పరుగులు ఆపుతున్నాడు. కాబట్టి ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటే ప్రొటీస్‌పై పేలవమైన రికార్డు ఉన్న ఉమేశ్, భువనేశ్వర్‌లలో ఒకర్ని తప్పించొచ్చు. యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రా చోటు ఖాయం. ఇక గత రెండు మ్యాచ్‌లో 300లకు పైగా పరుగులు చేయడం బ్యాటింగ్ ఫామ్‌ను చూపెడుతున్నా ఎక్కడో చిన్న అసంతృప్తి వెంటాడుతోంది. లంకతో మ్యాచ్‌లో స్లాగ్ ఓవర్లలో అదనంగా 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని విరాట్ భావన. కాబట్టి ఏడో నంబర్‌లో హార్దిక్‌ను హిట్టర్‌గా ఉపయోగించుకుని 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలని ప్రయత్నిస్తున్నాడు. వ్యక్తిగతంగా కూడా విరాట్, యువరాజ్‌కు ఇదో పెద్ద పరీక్ష. ప్రొటీస్‌పై గెలువాలంటే ఇద్దరూ ఆడాల్సిందే. ఇక ధవన్, రోహిత్‌లకు తాహిర్ నుంచి ముప్పు పొంచి ఉంది. ధోనీ ఆకట్టుకుంటున్నా.. జాదవ్ బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది.

సౌతాఫ్రికా కూడా అన్ని విభాగాల్లో బాగానే ఉంది. ముఖ్యంగా ఆ జట్టుకు బ్యాటింగ్ ప్రధాన బలం. ఆమ్లా, డికాక్ లాంటి ఓపెనర్లకు తోడు.. డుమిని, మిల్లర్, డుఫ్లెసిస్‌లతో మిడిలార్డర్‌ పటిష్టంగా ఉంది. వీరందరు ఒకెత్తైతే.. డివిలియర్స్ మరొకెత్తు. డివిలియర్స్ చెలరేగితే ఆపడం ఏ బౌలర్‌ కు సాధ్యం కాదు. కానీ భారత్‌పై ఏబీ రికార్డు మెరుగ్గా లేకపోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అంశం. ఇక మోరిస్, పార్నెల్, మోర్కెల్‌ల త్రయం పేస్ బౌలింగ్‌కు మారుపేరు. స్వింగ్, వేగంతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తారు.

ఓవరాల్‌గా బలం, బలహీనతల్లో సమానంగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది.