సుల్తాన్‌పూర్‌లో మెడిటెక్ పార్క్‌  

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలోని సుల్తాన్‌పూర్‌ గ్రామంలో దేశంలోనే తొలి మెడి టెక్‌ పార్క్ ఏర్పాటు కానుంది. 250 ఎకరాలలో.. టీఎస్‌ఐఐసీ ప్రతిష్టాత్మకంగా, అత్యాధునిక హంగులతో ఈ కొత్త పార్కును నిర్మిస్తున్నది. వైద్య రంగంలో ఉపయోగించే వివిధ రకాల పరికరాలను ఇందులో తయారు చేయనున్నారు. ఈనెల 17వ తేదీన మంత్రి కేటీఆర్  చేతుల మీదుగా మెడిటెక్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. అదే రోజున వైద్య పరికరాల తయారీ పరిశ్రమల స్థాపన కోసం ముందుకు వచ్చిన ఐదు సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకోనున్నారు.

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మెడిటెక్ పార్కు నిర్మాణానికి, దానికి అనుబంధంగా పారిశ్రామిక వాడ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పూర్తిగా కాలుష్యరహిత పారిశ్రామికవాడ, గ్రీన్‌ కారిడార్‌ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెడి టెక్ పార్కు స్థాపనకు సుల్తాన్ పూర్ అనువైన ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ఇక్కడికి అన్ని రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. ఔటర్‌ పై ఎక్కడి నుంచైనా 30 నిమిషాల్లో సుల్తాన్ పూర్‌ కు చేరుకునే అవకాశం ఉంది. మెడిటెక్ పార్కు ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా ఔటర్‌ జంక్షన్‌ సైతం ఉంది. పారిశ్రామికవాడకు 56.8 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది. ఔటర్ రింగు రోడ్డు, ముంబాయి జాతీయ రహదారి అతి సమీపంలో ఉండటంతో.. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.

మొదటగా వైద్య రంగ పరికరాల పరిశ్రమలకు 250 ఎకరాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు 50 ఎకరాల స్థలాలను కేటాయించనున్నారు. వీటితోపాటు 471 ఎకరాల్లో మెడిటెక్ పార్కును, ఈ పారిశ్రామిక వాడను రానున్న కాలంలో విస్తరించనున్నారు. అందుకు తగిన ప్రణాళికలను కూడా టీఎస్‌ఐఐసీ అధికారులు తయారు చేశారు. మరోవైపు మెడిటెక్ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు పూర్తయితే ప్రత్యేకంగా 5వేల మందికి, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి లభించనుంది. పరిశ్రమల ఏర్పాటు వలన స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా  మెడిటెక్ పార్కు, దాని అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో పటాన్ చెరువు ప్రాంతం మరింత అభివృద్ధి కానుంది.

మెడి టెక్ పార్కు శంకుస్థాపన కోసం పనులు వేగంగా జరుగుతున్నాయి.సుల్తాన్‌ పూర్‌ గ్రామ పరిధిలోని బండరాళ్లతో నిండి ఉన్న ప్రభుత్వ బంజరు భూమిని ప్రభుత్వం రూ.25 కోట్లు ఖర్చు చేసి కొత్త హంగులతో పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తున్నది. గుట్టలుగా ఉన్న రాళ్లను తొలగించి అధునిక హంగులతో విశాలమైనరోడ్లు వేస్తున్నారు. రోడ్లకు ఇరువైపుల పచ్చటి చెట్లు పెంచి పార్కులను తయారు చేయనున్నారు. విద్యుత్తు సబ్‌స్టేషన్‌, నీటి వసతి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు చేయనున్నారు. మరో మూడేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

సుల్తాన్ పూర్ గ్రామంలో 250 ఎకరాలలో ఈ మెడిటెక్ పార్కును పూర్తిగా కాలుష్యరహితంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. వైద్య రంగంలో వాడే పరికరాలను తయారు చేయడంతోపాటు మార్కెటింగ్ చేసుకునే విధంగా అన్ని వసతులు కల్పిస్తారు. ఇప్పటికే ఫార్మా, బయోటెక్ రంగాలలో ప్రపంచంలోనే గొప్ప పేరున్న తెలంగాణ  ఈ మెడిటెక్ పార్క్ తో మరిన్ని ఆవిష్కరణలు చేయబోతోంది. వైద్య పరికరాల తయారీ, ఉత్పత్తి, వాటిపరిశోధన, అభివృద్ధికి ఈ పార్క్ కేంద్రంగా మారనుంది.