సింగరేణి సమ్మె విఫలం

ఐదు జాతీయ సంఘాలు తలపెట్టిన సింగరేణి సమ్మె విఫలం అయ్యింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం లోని శ్రీరాంపూర్ ఏరియాలో దాదాపు వెయ్యి మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. అన్ని విభాగాలలో వందల సంఖ్యలో విధులకు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. సమ్మెను వ్యతిరేకిస్తూ.. కార్మికులు విధులకు హాజరు కావడంపై  అధికారులు హర్షం ప్రకటించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ  సింగరేణి సమ్మె విఫలం అయ్యింది. సింగరేణి ప్రధాన కేంద్రమైన కొత్తగూడెంలోని అండర్ మైన్స్, ఓపెన్ కాస్టులలో కార్మికులు యథావిధిగా విధులకు హాజరయ్యారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ.. స్వచ్ఛందంగా డ్యూటీలో పాల్గొన్నారు. అటు విధులకు హాజరైన కార్మికులను టీబీజీకేఎస్ నాయకులు అభినందించారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో సీఎం కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధి జాతీయ సంఘాలకు లేదన్నారు. తెలంగాణ కార్మికులు వారిని నమ్మడం లేదని చెప్పారు.