సాయి ప్రణీత్‌దే థాయ్‌లాండ్ టైటిల్

ప్రస్తుతం అద్భుత ఫామ్‌తో దూసుకెళుతున్న భారత యువ షట్లర్ సాయి ప్రణీత్ కెరీర్‌లో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాడు. ఈ హైదరాబాదీ స్టార్ ఆటగాడు థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో మూడోసీడ్ సాయి ప్రణీత్ 17-21, 21-18, 21-19తో ఇండోనేషియాకు చెందిన నాలుగోసీడ్ జొనాథన్ క్రిస్టీన్‌పై విజయం సాధించి తొలి గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ అందుకున్నాడు. గంటా పదకొండు నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలిగేమ్ కోల్పోయిన ప్రణీత్.. తర్వాత పుంజుకొని వరుసగా రెండుసెట్లలో ఆధిపత్యం చాటుకొని విజేతగా నిలిచాడు.  ప్రపంచ 24వ ర్యాంకరైన సాయి ప్రణీత్‌కిది ఈ ఏడాది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. ఈ ఏప్రిల్‌లో సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాడు. అంతకుముందు జనవరిలో భారత్ వేదికగా జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ఓపెన్‌లో సాయి ప్రణీత్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో సమీర్ వర్మ చేతిలో ఓడాడు. థాయ్‌లాండ్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ సాధించిన సాయి ప్రణీత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా అభినందించారు. థాయ్‌లాండ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన సాయి ప్రణీత్‌కు అభినందనలు. నీ సాధించిన ఈ ఘనతను చూసి భారత్ గర్వపడుతున్నది అని ప్రధాని ట్వీట్ చేశారు.