సానియాపై బోపన్న గెలుపు

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. ఇప్పటికే మహిళల డబుల్స్ నుంచి నిష్క్రమించిన హైదరాబాదీ ఏస్ తాజాగా మిక్స్‌డ్‌లోనూ పరాజయంపాలైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కే చెందిన రోహన్ బోపన్న.. సానియా జంటను చిత్తుచేసి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ పోరులో ఏడోసీడ్ బోపన్న-గాబ్రియెలా డాబ్రోవిస్కీ జంట 6-3, 6-4తో రెండోసీడ్ సానియా-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించింది. దీంతో టోర్నీలో భారత్ నుంచి బోపన్న మాత్రమే బరిలో మిగిలాడు. క్లెపాక్-ఇంగ్లోట్ జోడీ, లవకోవా-రోజర్ వాసెలిన్ జంట మధ్య జరిగే క్వార్టర్స్ విజేతతో బోపన్న ద్వయం సెమీస్‌లో తలపడనుంది. మరో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ డబుల్స్, మిక్స్‌డ్ నుంచి ఇప్పటికే వెనుదిరిగారు.