సకల జనులకు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం సకల జనులకు సంక్షేమాన్ని పంచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని సీఎం కేసీఆర్  అన్నరు.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్న సీఎం కేసీఆర్..  జాతీయ జెండాను ఎగురవేసారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించి ప్రసంగించారు. కాగ్  వెల్లడించిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 17.82 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలవడం మనందరికీ గర్వకారణమన్నరు. 40వేల కోట్ల రూపాయలతో 35 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. పేదింటి ఆడపిల్లల పెండ్లికోసం కళ్యాణలక్ష్మి-షాదీ ముబారక్  పథకం అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీల జనాభా శాతానికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతినిధిని ఏర్పాటు చేసుకుని ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నామన్నరు. ఒంటరి మహిళలకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల జీవన భృతి శనివారం నుండి ప్రారంభిస్తున్నామని చెప్పారు. మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్  అనే పథకం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్  ప్రకటించారు. తెలంగాణ ప్రజలందరికీ సీఎం కేసీఆర్  రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ అనతికాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించామని సీఎం కేసీఆర్ అన్నరు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం సాధించిన అపూర్వమైన విజయమే  ఇందుకు  నిదర్శనమని తేల్చిచెప్పారు. వచ్చే యాసంగి  నుండే రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రజలకు మంచినీరు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం అవుతుందన్నరు. మరోవైపు రాష్ట్రం నలులమూలలా రహదారులన్నింటినీ చక్కగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రజలకు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా రవాణా రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నామన్నరు. తెలంగాణకు హరితహారం మూడో దశ కార్యక్రమం వచ్చే నెలలో ప్రారంభమవుతుందని..ప్రజలందరూ హరితహారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వమే పూనుకున్నదని సీఎం కేసీఆర్  చెప్పారు.

కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునే దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని సీఎం కేసీఆర్  మండిపడ్డరు. జిల్లాలలో ఉండే వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలివేగం, భూముల రకాలను బట్టే ఎక్కడ ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. దాన్ని బట్టి రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర రైతు సమాఖ్యకు 500 కోట్ల రూపాయల నిధిని ప్రభుత్వం అందిస్తుంది. పంటల కొనుగోలు కోసం ఆ మూలధనాన్ని వినియోగించి, రైతులకు కనీస మద్దతు ధర రావడానికి రైతు సంఘాలు కృషి చేస్తాయన్నరు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రణాళికలో రైతులు నిబద్ధతతో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్  పిలుపునిచ్చారు.

కుల వృత్తులను కాపాడేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం కేసీఆర్‌. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు ఇతర కులవృత్తులు చేసుకుని బతికే వారే ఎక్కువ సంఖ్యలోఉన్నారన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో క్రమంగా కుల వృత్తులు ఉనికి కోల్పోతున్నాయని.. వాటిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కుల వృత్తులకు, చేతి వృత్తులకు సహకారం అందించి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనే.. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా బడ్జెట్ కేటాయింపులు చేసుకున్నామన్నారు.