సంఘమిత్ర హీరోయిన్‌గా నయన్!

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న తమిళ చిత్రం సంఘమిత్ర. సుందర్.సి తెరకెక్కించనున్న ఈ సినిమాలో యువరాణి సంఘమిత్ర పాత్ర కోసం తొలుత శృతిహాసన్‌ను చిత్ర వర్గాలు ఎంపిక చేశాయి. ఈ సినిమా కోసం కత్తి విద్యను కూడా నేర్చుకున్న ఆమె ఆ తరువాత తనకు స్క్రిప్ట్ ఏమిటో ఇంత వరకు వివరించడం లేదని చివరి నిమిషంలో ఈ చిత్రం నుంచి తప్పుకున్నది. ఆమె స్థానంలో అనుష్కతో సహా పలువురు అగ్ర కథానాయికల్ని పరిశీలించిన చిత్ర బృందం తాజాగా నయనతారను ఖరారు చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం హీరోయిన్ ప్రధాన చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాలు సాధిస్తున్న నయనతార అయితేనే సంఘమిత్రపై మంచి క్రేజ్ ఏర్పడుతుందని, యువరాణి పాత్రకు ఆమెకు మించిన ఛాయిస్ మరెవరూ లేరని చిత్ర బృందం ఓ నిర్ణయానికి వచ్చారని, ఇటీవలే ఆమెను సంప్రదించారని సమాచారం. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్య కథానాయకులుగా నటించనుండగా ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నారు.