షూటింగ్ ప్రపంచకప్‌లో భారత జోడీకి స్వర్ణం

భారత స్టార్ షూటర్లు జీతూ రాయ్, హీనా సిద్ధూ మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటారు. జీతూ-హీనా జోడీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో వరుసగా రెండో ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లోనూ స్వర్ణ పతకంతో మెరిసారు. గబాలలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జీతూ-హీనా జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో జీతూ జంట 7-6 స్కోరు తేడాతో రష్యా జోడీని ఓడించి పసిడి పతకాన్ని అందుకుంది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో ఫ్రాన్స్ జంట.. ఇరాన్ జోడీపై విజయం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటింగ్ ప్రపంచకప్‌లో మిక్స్‌డ్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. ఇటీవలే ఢిల్లీ వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ స్టేజ్-1 పోటీల్లో తొలిసారి మిక్స్‌డ్ ఈవెంట్‌లో పోటీలు నిర్వహించారు. ఇందులోనూ భారత జోడీ జీతూ-హీనాలు స్వర్ణం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో మిక్స్‌డ్ ఈవెంట్‌ను ఆడించేందుకు అధికారికంగా గుర్తింపు దక్కడంతో.. ఇందుకు సన్నాహకంగా ఇప్పటినుంచే మెగా ఈవెంట్లలో మిక్స్‌డ్ ఈవెంట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇక మిక్స్‌డ్‌లో విజేతగా నిలిచిన జీతూ, హీనాలు వ్యక్తిగత ఈవెంట్లలో మాత్రం ఫైనల్స్ చేరడంలో విఫలమయ్యారు. వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్‌లో క్వాలిఫయింగ్ రౌండ్లలో జీతూ 12వ స్థానంలో, హీనా 9వ స్థానంలో నిలిచారు. టాప్-8 స్థానాల్లో నిలిచిన షూటర్లే ఫైనల్స్ ఆడేందుకు అర్హులు.