షరీఫ్‌తో జిన్‌పింగ్ భేటీ రద్దు

పాతనేస్తమైన పాకిస్థాన్‌పై చైనా అసాధారణమైన రీతిలో అసహనం ప్రదర్శించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో జరుగాల్సిన భేటీని చైనా నేత జీ జిన్‌పింగ్ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఇద్దరు చైనా ఉపాధ్యాయులు బలూచిస్థాన్‌లో అపహరణకు, ఆపై హత్యకు గురైన ఘటనే ఇందుకు కారణం. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తున్నది. ఈ హత్యలపై చైనాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కజక్‌స్థాన్‌లోని అస్తానాలో షాంగై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సభ సందర్భంగా షరీఫ్, జిన్‌పింగ్ విడిగా భేటీ కావాల్సి ఉన్నప్పటికీ పాక్‌లో చైనా టీచర్ల హత్యలకు నిరసనగా చైనా అధ్యక్షుడు ఈ భేటీకి హాజరు కాకుండానే స్వదేశం వెళ్లిపోయారు.