శరవేగంగా మానేరు రివర్ ఫ్రంట్ పనులు

ఉత్తర తెలంగాణ సిగలో మెరవనున్న అద్భుతమైన ప్రాజెక్టు మానేర్ రివర్ ఫ్రంట్.  ఉత్తర తెలంగాణకు గేట్ వేగా ఉన్న కరీంనగర్  అభివృద్ధిని వేగవంతం చేయడంలో భాగంగానే ఈ  ఆలోచన పురుడు పోసుకుంది. అందుకే  9 కిలోమీటర్ల మేర మానేరు తీరాన్ని… రివర్ ఫ్రంట్ పేరుతో అభివృద్ధి చేయాలని  నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కింది. ప్రభుత్వం బడ్జెట్లో 506 కోట్లు దీనికోసం కేటాయించింది. గత నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ ప్రగతి భవన్ లో కరీంనగర్ అభివృద్దిపై సీఎం కేసీఆర్ రెండు రోజుల సమీక్ష నిర్వహించారు. మానేర్ రివర్ ఫ్రంట్ తక్షణ ప్రాథమిక పనుల ఖర్చుల కోసం 25 కోట్లు విడుదల చేశారు.

సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో మానేరు తీరాన్ని మహాపర్యాటక క్షేత్రంలా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు పడ్డాయి. పనులు వేగం పుంజుకున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 25 కోట్ల ఖర్చుతో ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవిందర్ సింగ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ శ్రీకారం చుట్టారు. మానేరు నది తీరం వెంబడి ఉన్న తుమ్మలు, తుంగ, లొట్టపీసు చెట్లు, పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు.  ఇందుకోసం నగరాన్ని ఐదు విభాగాలుగా విభజించారు.

మొదట్లో మానేరు రివర్ ఫ్రంట్ ను ఐదు కిలోమీటర్లు బొమ్మకల్ గ్రామం వరకే విస్తరించాలనుకున్నారు. కానీ సీఎం కేసీఅర్ హైదరాబాద్ లో ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించిన అనంతరం మానేర్ రివర్ ఫ్రంట్ ను 9 కిలోమీటర్ల కు విస్తరించాలని సూచించారు. దీనిని ఉత్తర తెలంగాణకు మణిహారంగా, దేశంలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. విశాలమైన ఫార్క్ లు, యోగా కేంద్రాలు, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాటుతో పాటు నదికి అభిముఖంగా స్వర్గదామంగా ఉండే నివాస గృహాలను ఇక్కడ నిర్మాణం కానున్నాయి.

మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు  ఫస్ట్ ఫేజ్ కింద కరీంనగర్ మండలం చేగుర్తి, మానకొండూర్ మండలం లింగాపూర్ వరకు, సెకండ్ ఫేజ్ కింద మానకొండూర్ మండలం వేగురుపల్లి వరకు సుందరీకరించనున్నారు. ఈప్రాంతాన్ని ఫిష్ జోన్ గా ప్రకటించారు. నదికి ఇరువైపులా సిల్వర్ ఓక్, పగోడ, మహాగని లాంటి పొడవైన చెట్లు..  10.5 కిమీ పొడవు ఉండే LMD కట్టపైన విరివిగా చెట్లు పెంచనున్నారు. డ్యాం ఎగువన టూరిస్టు స్పాట్, వ్యూ పాయింట్, రెస్టారెంట్లు, బోటింగ్, కాటేజీలు ఏర్పాటు కానున్నాయి. 15 కోట్ల కేంద్ర నిధులు,  25 కోట్ల రాష్ట్ర నిధులు మొత్తం 40 కోట్లతో మానేరు డ్యాం సుందరీకరణ పనులు జరగనున్నాయి.

సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు జోరుగా సాగుతున్నాయి. పనులు పూర్తైతే  రివర్ ఫ్రంట్ దేశంలోనే ఒక అద్భుత పర్యాటక క్షేత్రంగా అవతరించనుంది. ఉత్తర తెలంగాణ అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.