వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి

వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు, పండించిన పంటకు మంచి ధర రావడానికి వినూత్న పద్దతులు అవలంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. దీనికోసం అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు తగిన కార్యాచరణ రూపొందించాలని, రైతులకు మార్గదర్శనం చేయాలని కోరారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కల్తీని అరికట్టడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం చేపట్టాల్సిన చర్యలపై కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో అధికారులతో చర్చించారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, రామకృష్ణరావు, పార్థసారథి, జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

‘‘వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, చరిత్రలో మొదటిసారి ఎకరానికి ఎనిమిది వేల రూపాయల సాయం అందించబోతున్నాం. ప్రభుత్వమే పూనుకుని అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేస్తున్నాం. రైతు సమాఖ్యలను బలోపేతం చేస్తాం. రైతు సమాఖ్యలే పంటకు ధర నిర్ణయించే పరిస్థితి వస్తుంది. రైతు సంఘాల ఏర్పాటుతో దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న దోపిడీ నుంచి విముక్తి లభిస్తుంది.  పంట అమ్ముడుపోకపోతే రైతు సంఘాలే కొనుగోలు చేసే విధంగా సమాఖ్య వద్ద రూ.500 కోట్ల నిధి పెడతాం. రాష్ట్ర రైతు సంఘాన్ని శక్తి వంతమైన సంస్థగా తీర్చిదిద్దుతాం” అని సీఎం కేసీఆర్ చెప్పారు.

“మండలాల వారీగా రైతులను హైదరాబాద్ తీసుకొచ్చి సదస్సు నిర్వహిస్తాం. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో జిల్లాకొకరు చొప్పున హైదరాబాద్ నుంచి ప్రత్యేక అధికారులు వెళ్లి ఒక్కో గ్రామంలో రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసి రావాలి. క్రాప్ కాలనీలపై, రూ.8వేల పెట్టుబడి సాయంపై రైతులకు అవగాహన కల్పించాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భూములు, రైతుల సర్వే జరుగుతోంది. ఈ విషయంలో కూడా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పురోగతి తెలుసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

‘‘అవసరాలకు తగ్గట్లు పంటలు పండించాలి. కేవలం మనుషులు తినే ఆహార పదార్ధాలే కాకుండా కోళ్ల దాణా, పశువుల దాణా, చేపల దాణా.. తదితర అంశాలను కూడా అధ్యయనం చేయాలి. తెలంగాణలో ఏ ఆహారం ఎంత అవసరం అనే విషయంలో ఖచ్చితమైన అవగాహనకు రావాలి. దాన్ని బట్టే పంటలు పండించాలి. దాంతో పాటు తెలంగాణలో పండించడానికి అనువుగా ఉండి, వేరే ప్రాంతాలకు ఎగుమతి చేయగలిగే పంటలను గుర్తించాలి. వాటి సాగుకోసం రైతులను ప్రోత్సహించాలి. సాస్, గంజి, పల్ప్, వైన్ మేకింగ్ తదితర ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే విషయంలో రైతులకు తగిన సూచనలు చేయాలి” అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

“పండ్లు, కూరగాయలు తెలంగాణకు ఎన్ని అవసరం? ప్రస్తుతం ఎన్ని పండిస్తున్నాము? ఏ పండ్లకు, కూరగాయలకు మార్కెట్ ఉంది? అనే విషయాలను అధ్యయనం చేసి ఆ పంటలు పండించాలి. దశేరి, హిమాయత్ పసంద్ లాంటి మామిడి రకాలకు మంచి డిమాండ్ ఉంది. అవి పండించాలి. ప్రతీ గ్రామంలో రైతులు తమ భూములను క్రాప్ కాలనీలుగా మార్చుకోవాలి. ఊర్లో కొందరు కూరగాయలు వేసుకోవాలి. ఊళ్లో పండించిన కూరగాయలనే ఊళ్లో తినాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.