వేర్పాటువాదుల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు

కాశ్మీర్ లోయలో తీవ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తున్న రహస్య శక్తులపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపుతోంది. ఈ ఉదయం న్యూఢిల్లీ, శ్రీనగర్ సహా 14 ప్రాంతాల్లోని వేర్పాటువాదుల ఇళ్లపై అకస్మిక దాడులు చేపట్టింది. కాశ్మీరీ వేర్పాటువాది నయీం ఖాన్ నివాసంలోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. కాశ్మీర్ లోయలో తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు పాకిస్తాన్ నుంచి తనకు హవాలా మార్గంలో నిధులు అందుతున్నాయని నయీం ఓ స్టింగ్ ఆపరేషన్‌లో అంగీకరించాడు. ఈ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగానే ఎన్ఐఏ అతడిపై కేసు నమోదు చేసింది. స్టింగ్ ఆపరేషన్ బయటికి రావడంతో గిలానీ నేతృత్వంలోని వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నయీం ఖాన్‌ను బహిష్కరించింది. ఉగ్రకార్యకలాపాలకు ఆర్ధిక సాయం చేస్తున్నట్టు భావిస్తున్న కాశ్మీరీ వేర్పాటువాదులు ఫరూక్ అహ్మద్ దార్ అలియాస్ ‘బిట్టా కరాటే’, నయీం ఖాన్, తెహ్రీక్ హురియత్‌కు చెందిన జావేద్ అహ్మద్ బాబా అలియాస్ ‘ఘాజీ’ తదితరులపై ఎన్ఐఏ గత నెల 29 నుంచి విచారణ చేపట్టింది. పాకిస్తాన్ ఉగ్రసంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ అహ్మద్, కరడుగట్టిన వేర్పాటువాది సయీద్ అలీ షా గిలానీలతో పాటు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ నయీంల పేర్లను ఎన్ఐఏ ప్రాథమిక విచారణ (పీఈ)లో చేర్చింది. వీరి కార్యకలాపాలపై నిఘాపెట్టిన ఎన్ఐఏ.. విచారణలో లభించిన కీలక సమాచారం ఆధారంగానే మూకుమ్మడి సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.