వెస్టిండీస్ పై భారత్ బోణి

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా బోణీ కొట్టింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారీ తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్‌ ఫీల్డింగ్‌కు దిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ అజింక్య రహానే సెంచరీతో కదం తొక్కాడు. 104 బంతులాడిన రహానే 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ధావన్ 63 రన్స్ తో రాణించగా.. మెరుపు బ్యాటింగ్ చేసిన కెప్లెన్ కోహ్లి 87 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 4, యువరాజ్ సింగ్ 14 పరుగులకే ఔటై నిరాశపర్చారు.

వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్, నర్స్, కమ్మిన్స్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ ఏ దశలోనూ పోరాడలేదు. ఆరంభంలోనే భారత పేసర్ భువనేశ్వర్ దెబ్బకు పావెల్, మహమూద్ డకౌట్‌గా వెనుదిరిగారు. భువీ ధాటికి విండీస్ 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

టాపార్డర్‌ ను భువనేశ్వర్ దెబ్బ తీస్తే.. మిడిలార్డర్‌ ను చైనామన్ స్పిన్నర్ కులదీప్ పడగొట్టాడు. 9 ఓవర్లలో 50 పరుగులిచ్చిన కులదీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. విండీస్ బ్యాటింగ్‌లో ఓపెనర్ హోప్ ఒక్కడే 81 పరుగులతో పోరాడాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 43 ఓవర్లలో విండీస్ 6 వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేయగల్గింది.

105 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో మూడో వన్డే ఈ నెల 30న ట్రినిడాడ్‌ వేదికగా జరగనుంది.