కరీంనగర్ ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చండి

కరీంనగర్ ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశంలోని వంద స్మార్ట్ సిటీలకు సంబంధించిన మరో జాబితాను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అన్ని అర్హతలున్న కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ప్రకటించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి వెంకయ్యను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

అలాగే, రాష్ట్రంలోని 73 పట్టణాలను బహిరంగ మల విసర్జన లేని (ఓడిఎఫ్‌) లుగా ప్రకటించే కార్యక్రమానికి రావాల్సిందిగా వెంకయ్యనాయుడిని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా బహిరంగ మలవిసర్జనను నిర్మూలించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని వివరించారు.

అటు రియల్ ఎస్టేట్‌ క్రమబద్దీకరణ చట్టం అమలులోకి వచ్చిన సందర్భంగా ఆ రంగానికి సంబంధించిన అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్ట ప్రకారం రాష్ట్రంలో ఒక అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్‌  వెల్లడించారు.

21 రాష్ట్రాల్లో పట్టణాభివృద్ధి రంగానికి సంబంధించి అమలు అవుతున్న కార్యక్రమాలను సమీక్షించినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. దీనికి సంబంధించి తాను కూడా సీఎం కేసీఆర్ తో సమావేశం అవుతానని చెప్పారు.