వీణవంక దోషులకు కఠిన శిక్షలు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వీణవంక దళిత యువతిపై అత్యాచార ఘటనలో కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ ఐదో సెషన్స్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితులిద్దరిని దోషులుగా తేల్చింది. ఒకరికి జీవిత ఖైదు, మరొకరికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి నాగరాజు సంచలన తీర్పు చెప్పారు. మరో దోషి మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోంలో అబ్జర్వేషన్ లో ఉంచారు.

గతేడాది ఫిబ్రవరి 10న కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన దళిత యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. 16 నెలల విచారణ తర్వాత దోషులకు జైలు శిక్ష పడింది. ముద్దం అంజయ్యకు జీవిత ఖైదు విధించగా, గొట్టె శ్రీనివాస్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. పోలీసు కాని స్టేబుల్ ప్రవేశ పరీక్ష శిక్షణ కోసం వచ్చిన యువతిని ప్రేమ పేరుతో శ్రీనివాస్ మభ్య పెట్టి.. మరో ఇద్దరితో కలిసి గత ఏడాది ఫిబ్రవరి 10న బైక్‌ పై శంకరపట్నం మండలం కాచాపూర్ గుట్టల్లోకి  తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ముద్దం రాకేశ్ సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. బాధితురాలి స్నేహితురాలిపై కూడా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె బైక్‌పై నుంచి దూకి పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గతేడాది ఫిబ్రవరి 24న కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసులో కీలకమైన వీడియో సాక్ష్యంతో న్యాయమూర్తి శిక్షలు ఖరారు చేసారు.

నిందితుల్లో అంజయ్యకు ఎస్సీ-ఎస్టీ అత్యాచార చట్టం కింద జీవిత ఖైదు, శ్రీనివాస్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఒక్కొక్కరికి రూ. 11,800 జరిమానా విధించారు. ఇందులోంచి బాధితురాలికి ఒక్కొక్కరు 10 వేల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కోన్నారు. మైనరైన ముద్దం రాకేశ్ ను జువైనల్ హోంకు తరలించారు. తుది తీర్పు అనంతరం నిందితులిద్దరినీ కరీంనగర్ జైలుకు తరలించారు.

ఈ కేసును 5వ అడిషనల్‌ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు పదహారు నెలల పాటు విచారించింది. విచారణ అనంతరం దోషులకు శిక్ష ఖరారు చేసింది. దోషులకు శిక్ష పడడంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.