విత్తన ఉత్పత్తిలో దేశానికే ఆదర్శం

విత్తన ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల నుంచే 50 దేశాలకు విత్తన సరఫరా జరుగుతున్నదని ప్రశంసించారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తయారు చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. హన్మకొండలోని అంబేద్కర్‌ భవన్‌ లో జరిగిన జోనల్‌ విత్తన ధృవీకరణ సమీక్షా సమావేశంలో కడియంతో పాటు మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, చందూలాల్‌ పాల్గొన్నారు.

ఎకరానికి రూ. 8 వేల ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్‌ ప్రభుత్వమని కడియం శ్రీహరి అన్నారు. ప్రతీ ఏడాది నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని, రైతులు మంచి విత్తనాలు ఎంపిక చేసుకోవాలని సూచించారు. కల్తీ విత్తనాల నుంచి రైతుల్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన్రని కడియం చెప్పారు. వ్యవసాయానికి నిరంతరం 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని అన్నారు.

కల్తీ విత్తనాల తయారీదారులపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని మంత్రి పోచారం హెచ్చరించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చట్టం తీసుకువస్తామని చెప్పారు. విత్తనాలపై త్వరలోనే సబ్సిడీ ప్రకటిస్తామని పోచారం తెలిపారు. విత్తనోత్పత్తిలో రాష్ట్రం మంచి గుర్తింపు సాధించిందన్నారు. రైతులకు నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. రైతులకు మేలు చేసేందుకు సమగ్ర సర్వే చేస్తున్నామని వివరించారు.

రైతులు ఒకే రకమైన పంటలు వేయొద్దని, రకరకాల పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందని మంత్రి చందూలాల్ సూచించారు. విత్తన శుద్ధి కార్మాగారాలు పెరగాలని అన్నారు.

వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు.