విడిపోయిన జంటలను కలిపిన పోలీసులు

ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు భార్యాభర్తలకు సమస్యలు వస్తే అక్కడే పరిష్కారం అయ్యేవని, ఇప్పుడు భార్యాభర్తలు మాత్రమే ఉండేసరికి చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. ఇలాంటి వారికోసమే హైదరాబాద్ లో కౌన్సిలింగ్ సెంటర్ లను ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్ టివోలి గార్డెన్ లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన కలిసి ఉంటే కలదు సుఖం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విభేదాలు వచ్చి విడిపోయిన 72 జంటలను కలిపారు. ఈ కార్యక్రమంలో  హైదరాబాద్ అదనపు సిపి స్వాతిలక్రా, డిసిపి సుమతి, నాంపల్లి మెట్రోపాలిటన్ న్యాయమూర్తి రాధారాణి, రచయిత్రి వసంత లక్ష్మి పాల్గొన్నారు.

గత మూడేళ్ళుగా వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చినవాళ్లు మళ్ళీ కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు సీపీ మహేందర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ఆశించిన విధంగా మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ లో పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా అనేక మంది జంటలు కలిసిపోయారని తెలిపారు. క్షణికావేశంలో చిన్న చిన్న కారణాల వల్ల భార్యాభర్తలు  విడిపోతున్నారని, అలాంటివాళ్లు పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ ను సంప్రదించాలని సూచించారు. నార్త్ జోన్ లో 1656 జంటలు కుటుంబ సమస్యలతో వస్తే అందులో 548 కుటుంబాలు కలిసి ఉంటున్నందుకు నార్త్ జోన్ పోలీస్ అధికారులను అభినందించారు. ప్రతి ఒక్కరికి అవగాహన కలగడం కోసం “కలిసి ఉంటే కలదు సుఖం” అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందని సీపీ భరోసా ఇచ్చారు.

చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన జంటలు సిటీ పోలీస్ కౌన్సిలింగ్ ద్వారా కలిసినందుకు సంతోషంగా ఉందన్నారు స్వాతిలక్రా. ఇందులో భరోసా సెంటర్ ది కూడా చాలా పాత్ర ఉందన్నారు. విడిపోయిన జంటలను స్వచ్ఛంద సంస్థల సహాయంతో కౌన్సిలింగ్ నిర్వహించి కలుపుతున్నామని చెప్పారు. దేశంలోనే ఇలాంటి భరోసా సెంటర్ ఎక్కడ లేదన్నారు.