వరి మద్దతు ధర పెంపు!

వచ్చేనెల పెద్దఎత్తున వానాకాలం పంట పనులు మొదలుపెట్టబోతున్న రైతులకు ఉత్సాహం కలిగించేందుకు ధాన్యం, పప్పుధాన్యాల మద్దతు ధర పెంచాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. అయితే దేశంలో పలుచోట్ల రైతు ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచారు. ఏ మేరకు ధరలు పెంచిందీ అధికారికంగా ప్రకటించనప్పటికీ 2017-18 వానాకాలపు పంటపై కేంద్ర వ్యవసాయశాఖ చేసిన సిఫార్సులను క్యాబినెట్ ఆమోదించిందని అధికారవర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులు పంటరుణాల మాఫీని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై మంగళవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. ఈ నేపథ్యంలో కేంద్రం మీడియా హడావిడికి దూరంగా ఉంటున్నది. వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్ తన మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. క్యాబినెట్ నిర్ణయాలపై కూడా ఎలాంటి మీడియా సమావేశం జరుగకపోవడం విశేషం.  వ్యవసాయశాఖ వరిధాన్యం మద్దతు ధర సాధారణ రకానికి రూ.80 పెంచి రూ.1,550గా ఖరారు చేయాలని సిఫార్సు చేసింది. మొదటిరకం బియ్యానికి రూ.1,590 ఖరారు చేయాలని సూచించింది. ఇక పప్పులకు 2017-18 సంవత్సరానికిగానూ క్వింటాలుకు రూ.200 బోనస్ కలుపుకొని రూ.400 సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌లో ప్రధాన పంట అయిన సోయాబీన్ మద్దతుధరను క్వింటాలుకు రూ.175, పత్తి మద్దతు ధరను క్వింటాలుకు రూ.160 పెంచాలని కూడా వ్యవసాయ మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను సాధారణంగా ప్రభుత్వం యథాతథంగా ఆమోదిస్తుంది.