వరంగల్‌లో అన్నపూర్ణ భోజన కేంద్రాలు   

గ్రేటర్‌ హైదరాబాద్‌ తరహాలో వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 5 రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ భోజన కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అక్షయ ఫౌండేషన్‌ సహకారంతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. అందులోభాగంగా కిచెన్‌ నిర్మాణానికి సహకరించాల్సిందిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. బిల్డర్స్‌ అసోసియేషన్‌ ను కోరారు. దీంతో బిల్డర్స్‌ అసోసియేషన్‌ 35 లక్షల రూపాయలను అందించింది.

ఒక్కో ప్లేట్‌ భోజనానికి 24 రూపాయలు ఖర్చు అవుతుంటే.. ఈ పథకం కింద కేవలం ఐదు రూపాయలకే పేదలకు భోజనం అందించనున్నారు. మిగిలిన 19 రూపాయ‌ల‌ను కార్పోరేషన్ భ‌రించ‌నుంది. వివిధ పనుల కోసం నగరానికి వచ్చే ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వరంగల్‌ నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌.

ఈ పథకాన్ని అమలుచేసేందుకు నగరంలోని 8 ప్రాంతాలను గుర్తించారు.ఎంజీఎం, సీకేఎం ఆసుపత్రి, జడ్పీ ఆఫీస్‌, ఎనుమాముల మార్కెట్‌, వరంగల్‌, కాజీపేట రైల్వేస్టేషన్లు, అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద భోజన కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. భోజనకేంద్రాలు ఏర్పాటు చేసే స్థలాలను మేయర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ తో కలిసి కలెక్టర్‌ అమ్రపాలి పరిశీలించారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భోజన కేంద్రాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించనున్నారు.