వచ్చే 36 గంటల్లో భారీ వర్ష సూచన

రానున్న 36 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  నైరుతీ రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు నిజామాబాద్, నల్లగొండ, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5.30 గంటలకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని నవాబ్ పేటలో 2.6 సెంటీ మీటర్లు, హయత్‌నగర్‌లో 1.8 సెంటీ మీటర్లు, హైదరాబాద్ నగరంలో 1.5 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. నగరంలోని పాతబస్తీ, మెహదీపట్నం, బహదూర్‌పురా, చార్మినార్, గోల్కొండ, లంగర్‌హౌస్, రాజేంద్రనగర్, అత్తాపూర్, అమీర్‌పేట, బంజారాహిల్స్, నాంపల్లి, కోఠి, ఎల్బీనగర్, హయత్‌నగర్, నవాబ్‌పేట తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో 6.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బోధన్, రెంజల్, కోటగిరి , వర్ని, రుద్రూర్, నందిపేట్, మాక్లూర్, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో అన్ని చోట్ల వాన పడింది. కమ్మర్‌పల్లి, బాల్కొండ, భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాలోని 20 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 31.8మి.మీ. వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. జిల్లాలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడ్డాయి.