వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం పూర్తి

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేటలో విస్తృతంగా పర్యటించి ఎస్సారెస్పీ కాలువల స్థితిగతులపై ఆయన సమగ్ర పరిశీలన జరిపారు. ప్రతి ఏడాది లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు వృథా అవుతున్నాయని.. వృథా జలాలను బీడు భూములకు మళ్లించే మహాయజ్ఞం కొనసాగుతుందన్నారు. కాళేశ్వరం తొలి ఫలితం వరంగల్‌కే దక్కుతుందని చెప్పారు. ఎస్సారెస్పీ ప్రధాన కాలువ ద్వారా 7 వేల క్యూసెక్కుల నీరు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తొలిసారి థిక్ పాలిథిన్ కవర్‌ను కాలువపై కప్పి నీరు వృథా కాకుండా నూతన ప్రయోగం చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సారెస్పీ 1, 2వ దశ   కాలువలకు అవసరమైన రిపేర్లు, అప్‌గ్రేడ్‌లకు వెంటనే అనుమతిలిస్తామన్నారు. వర్ధన్నపేట మండలంలో ఆకేరువాగు వద్ద రూ. 8 కోట్లతో మిషన్ కాకతీయ-4 కింద చెక్‌డ్యాం నిర్మిస్తామని ప్రకటించారు. వచ్చే మే నుంచి ప్రతీ ఎకరాకు రూ. 4 వేలు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని తెలిపారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని హరీష్‌ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్ పాల్గొన్నారు.