వచ్చే ఏడాది కాళేశ్వరం నుంచి పొలాలకు నీరు

వచ్చే ఏడాది నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని చెరువుల ద్వారా పంట పొలాలకు నీరందించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకోసం బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్మాణాల కన్నా ముందే కాలువల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. గత ఏడాది ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులు నింపడం వల్ల 9 లక్షల ఎకరాల్లో పంట పండిందని తెలిపారు. పండిన పంట విలువ 4 వేల 725 కోట్ల రూపాయలని వెల్లడించారు. 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. దానికి వందల రెట్ల పంట చేతికొస్తున్నదని వివరించారు. ఇదే స్పూర్తితో కాళేశ్వరం కాలువలు కూడా నిర్మించి, వాటి ద్వారా చెరువులు నింపాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రగతి భవన్ లో నీటి పారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీష్ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ అధికారులు మురళీధర్, హరే రామ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.

గోదావరి నదిలో ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తరువాత పుష్కలంగా నీరు లభ్యమవుతోందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వాటా ప్రకారం నీటిని వాడుకుంటే భవిష్యత్తులో నీటి కొరతే వుండదన్నారు. ప్రాజెక్టుల ద్వారా నీరందించలేని ప్రాంతాల్లో చిన్న నీటి వనరులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఏడాదికి లక్షా 25 వేల కోట్ల రూపాయల పంట పండుతుందన్న సీఎం.. ఇది వార్షిక బడ్జెట్ కు సమానమని తెలిపారు. అటు కొండపోచమ్మ సాగర్ నిలువ సామర్థ్యం పెంచిన తరువాత రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించి ఆమోదించారు. 15 టీఎంసీల సామర్థ్యంలో నిర్మించే  కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు వెంటనే టెండర్లు పిలిచి.. 8 నుంచి 10 నెలల్లోనే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.

తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించే లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్ అందించడానికి ట్రాన్స్ కో ఏర్పాట్లు చేసిందని సీఎం వెల్లడించారు. లిఫ్ట్ ఇరిగేషన్ విద్యుత్ బిల్లులు నీటి పారుదల శాఖ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయం కోసం పెట్టే ఖర్చును ప్రభుత్వం రైతుల కోసం పెట్టే పెట్టుబడిగా భావిస్తుంది తప్ప.. భారంగా పరిగణించదన్నారు. ప్రస్తుతం భారీ నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించే పనిలో వున్న నీటి పారుదల శాఖ.. భవిష్యత్తులో ప్రాజెక్టుల నిర్వహణకు అనుగుణంగా పునర్ నిర్మాణం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈఎన్సీ, సీఈలు ఎంత మంది వుండాలి? వారెక్కడ పనిచేయాలి? అనే విషయంలో స్పష్టత వుండాలని చెప్పారు. అధికార యంత్రాంగమంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతం కాకుండా.. క్షేత్ర స్థాయికి విస్తరించాలని సూచించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ లో ఆంధ్రా ప్రాంతానికి అనుకూలంగా అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు, 31 జిల్లాలకు అనుగుణంగా నీటి పారుదల శాఖ అధికారిక వ్యవస్థ వుండాలని సీఎం కేసీఆర్ సూచించారు.

అటు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో సింగిల్  లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైల్ పై సీఎం సంతకం చేశారు. ఒక వ్యవసాయ మార్కెట్లో  లైసెన్స్ వున్న వ్యాపారులు.. ప్రస్తుతం మరో మార్కెట్లో కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. దీనివల్ల ఒక్కో మార్కెట్ కు కొందరు వ్యాపారులు మాత్రమే లైసెన్సుడ్ ట్రేడర్లుగా వుంటున్నారు. ఫలితంగా నామా మాత్రపు పోటీ మాత్రమే వుండి రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు. ఒక మార్కెట్ లో  లైసెన్స్ తీసుకున్న వ్యాపారి.. రాష్ట్రంలోని  ఇతర మార్కెట్లలో కూడా కొనుగోలు చేసుకునే అవకాశం వుంటే ప్రతీ మార్కెట్లో పోటీ పెరిగి రైతులకు మేలు జరుగుతుందని మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై  సానుకూలంగా స్పందించిన సీఎం.. రాష్ట్రంలో సింగిల్ లైసెన్స్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించాఠు.

మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు డి.రామచంద్రారెడ్డి, సి.భాగన్నలకు సొంత ఇండ్లు లేనందున వారికి ఇంటి స్థలాలు కేటాయించి, ఇండ్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రామచంద్రారెడ్డికి సిద్ధిపేటలో, భాగన్నకు జహీరాబాద్ లో ఇంటి స్థలం అందించాలని సూచించారు.