ల్యాంకో బకాయిల రికవరీకి ఆర్‌బీఐ ఆదేశం

బ్యాంకులకు వేల కోట్లు బకాయిపడ్డ మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ నుంచి రుణాలు రికవరీ చేసేందుకు దివాలా చట్టం ప్రకారంగా చర్యలు ప్రారంభించాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్టియానికి నేతృత్వం వహిస్తున్న ఐడీబీఐ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసిందని ల్యాంకో ఇన్‌ఫ్రా శనివారం వెల్లడించింది. మార్చి 31 నాటికి సంస్థ ఫండ్ ఆధారిత బకాయిలు రూ.8,146 కోట్లు, నాన్ ఫండ్ ఆధారిత బకాయిలు రూ.3,221 కోట్లుగా ఆర్‌బీఐ నోటీస్ పేర్కొన్నట్లు ల్యాంకో తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో మొత్తం మొండిబకాయిల్లో (ఎన్‌పీఏ) 25 శాతం వాటాకు సమానమైన 12 ఖాతాలపై దివాలా చట్టం ప్రకారంగా చర్యలు చేపట్టాల్సిందిగా బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు (ఎన్‌పీఏ) రూ.8 లక్షల కోట్ల స్థాయికి చేరుకోగా.. ఈ పన్నెండు సంస్థల బకాయిల వాటానే రూ.1.50 లక్షల కోట్లకు పైగా ఉంది.