లడఖ్‌ రైతుల సమస్యకు అద్భుత పరిష్కారం

మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఇంజనీర్ సోనమ్ వాంగ్ చుక్. తాను పుట్టిన గడ్డపై రైతులు ఎదుర్కుంటున్న సమస్యలకు అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు. వృథాగా పోతున్న కోట్ల లీటర్ల నీటిని ఒడిసి పట్టారు. అంతేకాదు నిత్యం భయాందోళనలకు గురిచేసే వరద ముప్పు నుంచి కూడా కాపాడారు. మంచు దుప్పటి కప్పుకున్నట్లు ఉండే లడఖ్ ప్రాంతంలో….కృత్రిమ మంచు స్థూపాలు ఏర్పాటు చేశారు.

లడఖ్‌ ప్రాంతంలో పెద్ద పెద్ద మంచు కొండలు ఉన్నప్పటికీ….సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఉండేది. నీరు మంచు రూపంలో గడ్డ కట్టి ఉండటంతో…వ్యవసాయానికి పనికి రాకుండా పోయేది. పైగా భూతాపానికి మంచు కరిగి, వరదల రూపంలో గ్రామాలను ముంచెత్తేది. దీంతో ఒకే సారి రెండు సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా అడుగేశారు సోనమ్. వేడికి కరుగుతున్న మంచు నీటిని భద్రపరిస్తే, వాటిని వ్యవసాయానికి వాడుకోవచ్చనీ, ఫలితంగా వరదల ప్రమాదమూ తగ్గుతుందని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా….లక్షల లీటర్ల నీటిని నిల్వ ఉంచే సామర్ధ్యంతో కృత్రిమ మంచు స్థూపాలకు శ్రీకారం చుట్టారు.

కరిగే హిమానీనదాల నీటిని ఒడిసిపట్టి, భారీ ఐసు కొండల్లా మార్చి అవసరానికి నీరందించేవే ఈ మంచు స్థూపాలు. దీని కోసం సోనమ్‌ మొదట వేల అడుగుల ఎత్తుమీదున్న సరస్సులోకి పైపులైన్‌ వేసి, మరో అంచుని వూరి మధ్యలో చదును చేసిన ప్రాంతం దగ్గర ఇరవై మీటర్ల ఎత్తులో అమర్చాడు. పైపులో నీరు గడ్డకట్టకుండా దాన్ని భూమికి రెండు మీటర్ల లోతులో ఉంచాడు. సరస్సులో నుంచి ప్రవహించేనీరు పైపులో నుంచి కింద పడే సమయంలో గాలి తగలగానే అది అక్కడికక్కడే గడ్డ కడుతుంది. అలా గడ్డకట్టిన నీరంతా అక్కడే భారీ మంచు కొండలా పేరుకుపోతుంది. చలికాలం ముగిసే సమయానికి చాలా నెమ్మదిగా ఆ ఐస్‌ కరగడం మొదలవుతుంది. ఆ నీటినే అక్కడి నుంచి చిన్నచిన్న పైపుల ద్వారా చుట్టుపక్కల పొలాలకు అందిస్తున్నారు.

మంచు కొండలు కరిగి లడఖ్‌ లోని చాలా ప్రాంతాలు ఎడారిలాగా తయారయ్యాయి. కానీ సోనమ్ ఏర్పాటు చేసిన కృత్రిమ మంచుకొండలు ఉన్న ప్రాంతంలో కరువు అనే మాటే లేకుండా పోయింది. తన ప్రయత్నం విజయవంతం కావడంతో…సోనమ్…తన ప్లాన్ ను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించారు.  కేవలం లడఖ్ లోనే కాదు,  నేపాల్, స్విట్జర్లాండ్ ల్లో  కూడా మంచు స్థూపాలను నిర్మించారు సోనమ్. ఇప్పటి వరకు ఆయన దాదాపు కోటిన్నర లక్షల లీటర్ల నీటిని నిల్వచేసుకునే స్థూపాలను నిర్మించారు.

సోనమ్ సేవలకు మెచ్చి ఎన్నో అవార్డులు వరించాయి. గతేడాది ప్రతిష్టాత్మక రోలెక్స్ అవార్డును కూడా పొందారు సోనమ్. అవార్డ్ గ్రహీతైన సోనమ్, తనకు వచ్చిన నగదు లక్ష డాలర్లు బహుమతిని లడఖ్‌లో చెట్లు నాటే కార్యక్రమానికి, మరో 20 ఐస్ స్థూపాల ఏర్పాటుకు కేటాయించారు. కేవలం నీటి కొరత తీర్చడమే కాదు, స్థానికంగా విద్యార్ధులకు వినూత్న రీతిలో పాఠాలు చెప్పేందుకు ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు సోనమ్. రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన త్రీఇడియట్స్ మూవీలో అమీర్ ఖాన్ పాత్రకు సోనమ్ వాంగ్ చుక్ నుంచే ప్రేరణ పొందారు.