లండన్‌ ఉగ్రదాడి ముష్కరుల్లో పాకిస్థానీ!

లండన్‌ ఉగ్రదాడిలో ముష్కరుల అచూకీ కనిపెట్టటంపై పోలీసులు దృష్టి పెట్టారు. మొత్తం ముగ్గురు టెర్రరిస్టులు ఈ దాడిలో పాల్గొనగా వారిలో ఇద్దరిని గుర్తించారు. ఐతే ఈ ఇద్దరిలో ఓ వ్యక్తి పాకిస్థాన్‌ కు చెందిన వాడు. ఖుర్రమ్ షజాద్ భట్ అనే వ్యక్తి పాకిస్థాన్‌ లో పుట్టి లండన్‌ లో స్థిరపడ్డాడు. ‘ద జీహాదీస్ నెక్స్ట్ డోర్’ అనే ఒక డాక్యుమెంటరీలో కూడా  అతను నటించాడు. ఈ విషయాన్ని బ్రిటన్‌కు చెందిన ఎం.ఐ5 ఇంటెలిజెన్స్ సర్వీస్ గుర్తించింది. ఖుర్రమ్‌ కొన్నాళ్లు కె.ఎఫ్‌.సి లోను, మరికొన్నాళ్లు వేరే కంపెనీలలోను పనిచేసినట్లు గుర్తించారు.

ప్రస్తుతం నిషేధానికి గురైన అల్-ముహాజిరౌన్ అనే సంస్థ మాజీ అధినేత అంజెమ్ చౌదరితో ఖుర్రమ్‌కు మంచి సంబంధాలు ఉండేవి. ఇస్లామిక్ స్టేట్ జీహాదీలను ప్రోత్సహిస్తున్నందుకు, తన ప్రవచనాలతో యువతను రెచ్చగొడుతున్నందుకు చౌదరికి ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. అలాంటి వ్యక్తులతో తిరగటంతో ఖుర్రమ్ సైతం ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడైనట్లు భావిస్తున్నారు.

అటు ఖుర్రమ్‌ ఇంటి చుట్టుపక్కల వారు మాత్రం అతని గురించి మంచిగా చెబుతున్నారు. హాయ్‌, బై తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదంటున్నారు. ఖుర్రమ్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. అతనితో ఉన్న మరో ఉగ్రవాది పేరు రాచిడ్ రెడౌన్ అని చెప్పారు. మరో వ్యక్తి వివరాలు మాత్రం తెలియలేదు.