లండన్‌లో ఉగ్రదాడి, ఆరుగురు మృతి

బ్రిటన్ రాజధాని లండన్ పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. నగరంలో రెండు చోట్ల దాడులకు తెగబడ్డారు. ఎవరూ ఊహించని విధంగా ఒక వాహనంతో రక్తపాతం సృష్టించారు. ఈ తెల్లవారుజామున బ్రిడ్జి మీద నడుస్తున్న పాదచారులను  ఉగ్రవాదులు వ్యాన్‌ తో ఢీకొట్టారు. బ్రిడ్జ్‌ కు సమీపంలో ఉన్న బార్లు, రెస్టారెంట్ల వద్ద  ఉగ్రవాదులు కత్తి పోట్లతో దాడులు చేశారు. బ్రిడ్జ్ సమీపంలోనే బారో మార్కెట్లో కూడా ఉగ్ర మూకలు బీభత్సం సృష్టించారు. దాడుల్లో మొత్తం ఆరుగురు మృతిచెందగా.. 10 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. అటు లండన్‌పై దాడిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తో పాటు వివిధ దేశాల అధినేతలు ఖండించారు. బ్రిటన్‌కు తగిన సహకారం అందిస్తామని ప్రకటించారు.